Krishnam Raju first Movie chilaka gorinka Specials
Krishnam Raju First Movie : రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ విషాదంలోకి వెళ్ళిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని సంఘటనలని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణంరాజు 1966లో చిలకా గోరింకా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
1965లో ‘చిలకా గోరింకా’ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని దర్శకుడు ప్రత్యగాత్మ తెరకెక్కించాడు. ఈ సినిమాతో మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు కూడా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పటికే 50 సినిమాల్లో నటించిన సీనియర్ నటి అయిన కృష్ణకుమారి నటించింది. చిలకా గోరింకా కృష్ణంరాజుకు మొదటి సినిమా. ఒక కొత్త హీరో పక్కన 50 సినిమాలకు పైగా చేసిన హీరోయిన్ చేయడమంటే సాహసమే.
అయితే కృష్ణకుమారి అప్పటికే దర్శకుడు ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన భార్యభర్తలు, కులగోత్రాలు సినిమాలలో హీరోయిన్‌గా నటించడంతో దర్శకుడి కోసం కొత్త హీరో పక్కన చేయడానికి ఒప్పుకుంది. హాస్యనటి రమాప్రభ కూడా ఈ సినిమాతోటే సినీపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. చిలకా గోరింకా సినిమా ఆర్ధికంగా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని కూడా అందుకుంది. ఇలా కృష్ణంరాజు తన మొదటి సినిమాలోనే 50 సినిమాలకి పైగా చేసిన హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.