Lavanya Tripathi Started her new Movie Sathi Leelavathi
Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023లో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా కోడలు అయిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి తర్వాత లావణ్య రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. అయితే పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే ఓ వెబ్ సిరీస్ తో పలకరించినా సినిమా మాత్రం ఇంకేమి రాలేదు. లావణ్య చివరగా హ్యాపీ బర్త్ డే అనే సినిమాతో థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు త్వరలో కొత్త సినిమాతో రాబోతుంది.
పెళ్లి తర్వాత లావణ్య తన మొదటి సినిమాగా సతీ లీలావతి అని ఇటీవల ప్రకటించగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్స్ పై నాగమోహన్ బాబు, రాజేష్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ మెయిన్ లీడ్స్ గా ఈ సతీ లీలావతి సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
లావణ్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నేడు ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ తో పాటు హీరో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టగా వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ తాతినేని సత్య మాట్లాడుతూ.. ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా సతీ లీలావతి తెరకెక్కుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం అని తెలిపారు.