lawyer lodged police complaint on hero devarakonda in sr nagar police station nk
Vijay Devarakonda: చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. హీరోపై పోలీసులకు ఫిర్యాదు
Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్. ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ లో మాట్లాడిన విజయ్.. ఆదివాసీయులను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు లాయర్ లాల్ చౌహాన్.
ఈ ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేయడంపై న్యాయ సలహా కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. కాగా, విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఏపీలోనూ అతడిపై ఆగ్రహం వ్యక్తమైంది. విజయ్ తమకు క్షమాపణలు చెప్పాలని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విజయ్.. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఉగ్రదాడిని ఖండించాడు. ఈ క్రమంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కశ్మీర్ లో దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారని కామెంట్స్ చేశాడు.
అంతే, ట్రైబల్స్ అంటూ రౌడీ హీరో చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. కాంట్రవర్సీకి దారితీశాయి. ట్రైబల్స్ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల నేతలు కోపంగా ఉన్నారు. ట్రైబల్స్ గురించి విజయ్ కు ఏం తెలుసు? చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. విజయ్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.