Leader : లెజెండ్ శరవణన్ ‘లీడర్’ మూవీ రివ్యూ.. ఒకదాన్ని మించి ఒకటి ట్విస్టులు మాములుగా లేవుగా..
తమిళ్ హీరో లెజెండ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'లీడర్'. (Leader)
- Saketh U
- Published On : April 4, 2026 / 04:33 PM IST
Leader Review
Leader Movie Review : లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై RS దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ హీరో లెజెండ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లీడర్’. పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, కాలకేయ ప్రభాకర్, అమృత అయ్యర్, విటివి గణేష్, ఐశ్వర్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ లో ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవ్వగా తెలుగులో నేడు ఏప్రిల్ 4న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
శక్తివేల్( శరవణన్) తన భార్య చనిపోవడంతో ట్యుటికోరన్ లో మెకానిక్ పని చేసుకుంటూ కూతురుతో కలిసి బతుకుతూ ఉంటాడు. డెవిల్ అనే ఓ మాఫియా లీడర్ కొంతమందితో కలిసి ట్యుటికోరన్ హార్బర్ ని నాశనం చేయాలనీ ప్లాన్ చేస్తారు. అక్కడ హార్బర్ లో ఏదో జరుగుతుందని అనుమానమొచ్చి పోలీసాఫీసర్ ఇంద్ర సత్యమూర్తి(ఆండ్రియా) తన పై అధికారులు నో చెప్పినా సైలెంట్ గా విచారిస్తుంటుంది. పై ఆఫీసర్లు, తన చుట్టూ ఉండేవాళ్ళు అంతా డెవిల్ మనుషులే. అదే సమయంలో ఆ ఏరియాకు SP గా భక్తవత్సలం(శ్యామ్ వస్తాడు). శక్తివేల్ కి హార్బర్ లోకి ఎంట్రీ ఉందని తెలిసి అతని కూతుర్ని అడ్డుపెట్టుకొని ఇంద్ర సత్యమూర్తి ఓ ప్లాన్ తో హార్బర్ లో భారీ మొత్తంలో ఉన్న పేలుడు పదార్థం అమ్మోనియా నైట్రేట్ ని పట్టుకుంటారు.
ఇది శక్తివేల్ వల్లే జరిగిందని ఆ హార్బర్ రౌడీ సాల్ట్(కాలకేయ ప్రభాకర్) అతని కూతురు ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి పోలీసుల దగ్గర్నుంచి ఆ అమ్మోనియా నైట్రేట్ ని తెమ్మంటాడు. అసలు ఇదంతా శక్తివేల్ ఎలా చేసాడు అని భక్తవత్సలం కి అనుమానమొచ్చి అతని గురించి విచారణ చేయిస్తాడు. అసలు శక్తివేల్ ఎవరు? తన భార్య ఎలా చనిపోయింది? శక్తివేల్ పోలీసుల దగ్గర్నుంచి అమ్మోనియా నైట్రేట్ కొట్టేసి పాపని కాపాడతాడా? డెవిల్ ఎవరు? ఎందుకు హార్బర్ ని నాశనం చేయాలనుకుంటారు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Biker Movie Review: ‘బైకర్’ మూవీ రివ్యూ.. బైక్ రేసింగ్ అదిరిందిగా..
సినిమా విశ్లేషణ..
లెజెండ్ శరవణన్ తమిళనాడులో పెద్ద వ్యాపారవేత్త అతను సినిమాల్లోకి వచ్చి మొదటి సినిమా చేసినప్పుడు అందరూ అతన్ని ఎగతాళి కూడా చేసారు. శరవణన్ ఎలా నటించినా అది మంచి కంటెంట్ సినిమా. ఇప్పుడు రెండో సినిమాగా లీడర్ తో వచ్చాడు. ఇది కూడా మంచి కంటెంట్ సినిమానే.
ఫస్ట్ హాఫ్ అంతా కూతురుతో శరవణన్ సింపుల్ ఫ్యామిలీ లైఫ్, ఇంద్ర సత్యమూర్తి విచారణ, హార్బర్ చుట్టూ కథ, అమ్మోనియా నైట్రేట్ పట్టుకోవడంతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొదటి అరగంట సింపుల్ గా ఏదో నడుస్తుంది. కానీ తర్వాత నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి అసలు శక్తివేల్ ఎవరు అని ఆసక్తి నెలకొంటుంది. సినిమాకు సెకండ్ హాఫ్ హైలెట్. సెకండ్ హాఫ్ లో శక్తివేల్, అతని టీమ్ ఏం చేసారు, అతని భార్యతో ప్రేమకథ ఏంటి.. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది.
ఆ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో క్లైమాక్స్ వరకు డెవిల్ వర్సెస్ శక్తివేల్ అన్నట్టు యాక్షన్ పార్ట్ సాగుతుంది. లాస్ట్ గంట మాత్రం చాలా సీన్స్, ట్విస్టులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. చివరి వరకు ఊహించని ట్విస్టులతో ఆసక్తికర స్క్రీన్ ప్లేతో సినిమాని రసవత్తరంగా నడిపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొంత కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. కూతురు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఒకటి రెండు సీన్స్ లో కన్నీళ్లు పెట్టడం ఖాయం. క్లైమాక్స్ లో ఓ ట్రైన్ లో దాదాపు 5 నిమిషాల పాటు ఉండే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్.
హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండటం, విలన్ కి హీరోకి లింక్ ఉండటం, హీరో భార్య చనిపోవడం, హీరో రివెంజ్ తీర్చుకోటం.. ఇలా కథ రొటీన్ అయినా దాని చుట్టూ రాసుకున్న సీన్స్, స్క్రీన్ ప్లే, ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి. అయితే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే విజయ్, అజిత్, సూర్య.. లాంటి స్టార్ హీరోలకు పడి ఉంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. లెజెండ్ శరవణన్ చేసాడు కాబట్టి సినిమా బాగున్నా ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
లెజెండ్ శరవణన్ తన నటనతో గత సినిమా కంటే బాగానే మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో మాత్రం బాగా నటించాడు. పాయల్ రాజ్ పుత్ కూడా బాగానే నటించింది. ఆండ్రియా తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. శ్యామ్ పర్వాలేదనిపించారు. నెగిటివ్ షేడ్స్ లో సంతోష్ ప్రతాప్, కాలకేయ ప్రభాకర్ బాగా నటించారు. శరవణన్ కూతురుగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ క్యూట్ గా తన నటనతో మెప్పించింది. అమృత అయ్యర్ ఓ కీలక పాత్రలో మెప్పించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Raakaasa Review : ‘రాకాస’ మూవీ రివ్యూ.. హిలేరియస్ హారర్ కామెడీ.. పడీ పడీ నవ్వాల్సిందే..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్ లో బీజీఎమ్ అదరగొట్టేసాడు గిబ్రన్. పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. చాలా షార్ప్ ఎడిటింగ్ తో సినిమాని పర్ఫెక్ట్ గా కట్ చేసారు. పాత కథే అయినా అదిరిపోయే రేసీ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు భారీగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘లీడర్’ సినిమా ట్విస్టులతో సాగిన యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
