Dirty Fellow Movie Review : ‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ.. మాఫియా కథతో..

డర్టీ ఫెలో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా.

Dirty Fellow Movie Review : ‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ.. మాఫియా కథతో..

Mafia Story Based Dirty Fellow Movie Review and Rating

Dirty Fellow Movie Review : శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ సినిమాలో సత్యప్రకాష్, నాగినీడు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై GS బాబు నిర్మాణంలో తెరకెక్కింది. నేడు మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. మాఫియా డాన్‌ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) చాలా కాలంగా మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే దందాలు చేస్తూ ఉంటారు. జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఎదగొచ్చని శంకర్‌ నారాయణ కుట్ర పన్ని జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోవడంతో జేపీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని చంపుతానని శంకర్ నారాయణ వార్నింగ్‌ ఇస్తాడు. మరోవైపు సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలో ఓ పూజరి ఇంట్లో ఉంటూ అక్కడి పిల్లలకు చదువు చెప్తూ ఉంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని ఇష్టపడుతుంది. ఆ గూడెం, అక్కడ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని అందర్నీ భయపెడుతుంటే అతన్ని సిద్దు చంపేస్తాడు. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద వచ్చిన చిత్ర (సిమ్రితి) సిద్ధుని షూట్ చేస్తుంది. అసలు చిత్ర ఎందుకు సిద్ధుని షూట్ చేస్తుంది? సిద్దు, డర్టీ ఫెలో ఒక్కరేనా? శంకర్ నారాయణ పగ తీర్చుకుంటాడా? జేపీ ఏమయ్యాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Yakshini Trailer : ‘యక్షిణి’ ట్రైలర్ రిలీజ్.. వామ్మో మంచు లక్ష్మి, వేదిక భయపెట్టడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

సినిమా విశ్లేషణ.. మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఇది లోకల్ మాఫియాలా అనిపిస్తుంది. డర్టీ ఫెలో సినిమా పూర్తిగా పాటలు, ఫైట్లు, రొమాన్స్ సీన్స్ తో కూడా కమర్షియల్ సినిమా. అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ జతచేశారు. కథనం ఫాస్ట్ గానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ డర్టీ ఫెలో గురించి చూపించి ఆ తర్వాత సిద్ధూ పాత్రని తీసుకురావడంతో ఇద్దరు ఒకరేనా కాదా అనే క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ వరకు ఉంటుంది. ఇంటర్వెల్ ముందు చిత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ డర్టిఫెలో చుట్టూ కథ సాగుతుంది. మాఫియా నేపథ్యంలో డర్టీ ఫెలో కొత్తగా ట్రై చేశారు. కొన్ని సీన్స్ అక్కడక్కడా బోర్ కొట్టిస్తాయి. ఎక్స్ నేవి సోల్జర్ శాంతిచంద్ర ఈ సినిమాతో హీరోగా మారడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సిద్దు, డర్టీ ఫెలో పాత్రల్లో వేరియేషన్స్ చూపించి శాంతి చంద్ర బాగానే మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్ లో ఓకే అనిపించాడు. నాగినీడు చాలా రోజుల తరువాత కనిపించి అలరించాడు. సత్య ప్రకాష్ మరోసారి విలన్ గా మెప్పించాడు. పోతురాజు పాత్ర కూడా పేరుకు తగ్గట్టు గాంభీర్యం చూపించాడు. ఇక దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్.. అందాల ఆరబోత బాగానే చేశారు. నటనలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. డాక్టర్‌. సతీష్‌ కుమార్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా సీన్స్ ని హైలెట్ చేసాడు. టైటిల్‌ సాంగ్‌ తప్ప మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోవు. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు. కథనం ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడిగా ఆడారి మూర్తి సాయి పర్వాలేదనిపించాడు.

మొత్తంగా డర్టీ ఫెలో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. ఈ సినిమాకి రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.