Marco : ‘మార్కో’ మూవీ రివ్యూ .. బాబోయ్ మలయాళం సినిమాలో మరీ ఇంత వైలెన్సా..

మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'మార్కో'. మలయాళంలో డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించి అనంతరం అన్ని భాషల్లో రిలీజవుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Malayalam Star Unni Mukundan Marco Movie Review

Unni Mukundan Marco Movie Review : మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మార్కో’. మలయాళంలో డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించి అనంతరం అన్ని భాషల్లో రిలీజవుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో రేపు జనవరి 1న రిలీజ్ అవుతుండగా నేడు ప్రీమియర్స్ వేశారు. షరీఫ్ మొహమ్మద్ నిర్మాణంలో హనీఫ్ అదేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే.. జార్జ్(సిద్దిఖ్), టోనీ(జగదీశ్)మరికొంతమంది గోల్డ్ స్మగ్లింగ్ నడిపించే గ్యాంగ్ స్టర్స్. జార్జ్ తమ్ముడు అంధుడు విక్టర్(ఇషాన్)ని, అతని ఫ్రెండ్ వసీంని కొంతమంది చంపేస్తారు. ఈ విషయం లండన్ లో ఉండే విక్టర్ అన్నమార్కో(ఉన్ని ముకుందన్)కి తెలిసి తన తమ్ముడ్ని చంపిన వాళ్ళను చంపడానికి ఇండియా వస్తాడు. అప్పటికే అతనికి మరియా(యుక్తి తరేజా)తో నిశ్చితార్థం అయి ఉంటుంది. మరి విక్టర్ ని చంపిన వాళ్ళు ఎవరు? వాళ్ళను మార్కో పట్టుకున్నాడా? మార్కో – మరియా ప్రేమ ఏమైంది? ఈ గ్యాంగ్ స్టర్స్ కథేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Unstoppable With NBK S4 : ఏం డైరెక్ట‌ర్ గారు చొక్కా మీద చొక్కా వేశారు.. బాబీతో బాల‌య్య.. అన్‌స్టాప‌బుల్ ప్రొమో అదిరింది.

సినిమా విశ్లేషణ.. తమ్ముడిని చంపితే పగతీర్చుకోవడానికి అన్న రావడం అనే పాయింట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కథ కూడా సింపుల్ లైన్. ఫస్ట్ హాఫ్ లో తమ అక్రమ బిజినెస్ సీక్రెట్స్ తెలిశాయని వసీంని కొంతమంది చంపేస్తారు. వాళ్ళని వాసనతో అంధుడు విక్టర్ కనిపెట్టడంతో అతన్ని కూడా చంపేస్తారు. దీంతో అతని అన్నయ్యలు మార్కో, జార్జ్ తమ తమ్ముడిని పట్టుకునేవాళ్ళని వెతకడంతో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ కి ఎవరు చంపారో హీరోకి తెలిసిపోతుంది. అయితే ఎవరు చంపారో ఆడియన్స్ కి ముందే తెలుస్తుంది కాబట్టి ఇంటర్వెల్ అంత ఇంపాక్ట్ అనిపించదు. సెకండ్ హాఫ్ హీరో వాళ్లపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు, వాళ్ళు హీరోని, అతని ఫ్యామిలీని ఏం చేసారు అని సాగుతుంది.

ఇప్పటికే 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఈ సినిమాలో వైలెన్స్ బాగా ఎక్కువగా ఉంది. మలయాళంలో ఈ రేంజ్ వైలెన్స్ సినిమాలు ఎక్కువగా రాలేదు కాబట్టి అక్కడ క్లిక్ అయింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో వైలెన్స్ అయితే అసలు చూడలేము. మొదట్నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు హీరోని ఎలివేట్ చేసి ప్రీ క్లైమాక్స్ లో ఒక్కసారిగా జీరోని చేసేస్తారు. మళ్ళీ క్లైమాక్స్ లో హీరోని ఎలివేట్ చేస్తారు.

కథ, కథనం కూడా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా నరుక్కోవడంతోనే వైలెన్స్ గా సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే మరీ దారుణంగా డిజైన్ చేసారు. ఈ సినిమాకు ఫ్యామిలీతో, పిల్లలతో వెళ్లకపోవడమే మంచిది. కొన్ని వైలెన్స్ సీన్స్ కి అసలు సెన్సార్ ఎలా ఓకే చేసిందో, డైరెక్టర్ ఎలా తీయగలిగాడో అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఉన్ని ముకుందన్ తన బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్స్ సీన్స్ లో స్టైలిష్ గా అదరగొట్టాడు. జగదీశ్, కబీర్ సింగ్, అభిమన్యులు నెగిటివ్ షేడ్స్ లో బాగా నటించారు. యుక్తి తరేజా కాసేపే కనిపించి అలరిస్తుంది. సిద్దిఖ్ కి ప్రీ క్లైమాక్స్ లో మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. అంధుడి పాత్రలో నటించిన ఇషాన్ తన నటనతో మెప్పిస్తాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ లో సినిమాటిక్ షాట్స్ బాగున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. పాటలు యావరేజ్. సింపుల్ కథ, కథనం అయినా సాంకేతికంగా దర్శకుడిగా బెస్ట్ ఇచ్చాడు హనీఫ్. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘మార్కో’ సినిమా ఓవర్ వైలెన్స్ తో ఓ రెగ్యులర్ రివెంజ్ యాక్షన్ డ్రామా. పిల్లలను, ఫ్యామిలీలను ఈ సినిమాకు దూరంగా ఉంచితే మంచిది. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.