Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్. ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి బెస్ట్.. ఇడియట్ సినిమాలో రవితేజ గొంతు చించుకొని మరీ అరుస్తాడు. మాస్ మహారాజ రవితేజనే కాదు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో మెగాస్టార్ పై తమకున్న ప్రేమను చూపించారు. సినిమా హీరోల ఫ్యాన్స్ అంతా ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉంటారు. హీరోలందరూ ఒకటిగా బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటారు. అలా ఫ్యాన్స్ వార్స్ చేసే అభిమానుల ఫేవరేట్ హీరోలకు ఫేవరేట్ హీరో కూడా చిరంజీవే. ఈ విషయం అనేకమంది స్టార్స్ అనేక ఈవెంట్స్ లో బహిరంగంగా చెప్పారు.(Megastar Chiranjeevi)
ఎవరూ తెలియని సినీ సముద్రంలోకి ఒంటరిగా వచ్చి ఆ సముద్రాన్నే ఏలిన ‘మగధీరుడు’ ‘చిరంజీవి’. సామాన్య కార్మికుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన అభిమానులే. ఆయన సినిమా చూసి ఆనందించిన వాళ్ళే. ఊహ తెలిసిన పిల్లాడి నుంచి మంచమెక్కిన ముసలోళ్ల వరకు మెగాస్టార్ అంటే అభిమానం ఉన్నవాళ్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తిని కదిలించినా గతంలో చిరంజీవి సినిమా చూడటానికి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరూ ఒక్క కథ అయినా చెప్తారు.
Also Read : Paradha Review : ‘పరదా’ మూవీ రివ్యూ.. కొత్త ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్..
తెలుగు సినిమాకి మొదటి యాంగ్రీ యంగ్ మాన్, మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, చార్లీ చాప్లిన్, మార్లోన్ బ్రాండో, మాటినీ ఐడల్.. అన్ని ఆయనే.. కానీ ఆయనకు అప్పుడే 70 ఏళ్ళు.. అరే మొన్నే కదా ‘ఖైదీ’ సినిమాకు చొక్కాలు చించేసుకున్నాం, ‘యముడికి మొగుడు’ సినిమాకు పేపర్లు ఎగరేశాం, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి అబ్బురపోయాం, ‘పసివాడి ప్రాణం’ సినిమాకు విజిల్స్ వేసాం, అప్పుడే మా ‘విజేత’ 70 ఏళ్ళు అందుకున్న ‘మగమహారాజు’ అయిపోయారా అని ఓ సగటు సీనియర్ చిరంజీవి అభిమాని ఆలోచన.
ఒక్కసారి వెన్కక్కి తిరిగి చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ అనే అడివిలో ‘మృగరాజు’లా ముప్పై ఏళ్ళు ఏకచత్రాధిపత్యంగా ఏలిన హీరో. తెలుగు తెరకు కమర్షియల్ సినిమాల అర్ధం చెప్పిన హీరో, కమర్షియల్ సక్సెస్ ల మధ్య నటనా ప్రావీణ్యాన్ని చూపించిన నటుడు. మైఖేల్ జాక్సన్ ని చూసి వావ్ అనుకునే వాళ్లంతా చిరు డ్యాన్స్ ని చూసి డ్యాన్స్ లో ‘రాక్షసుడు’ అని ఆశ్చర్యపోయేలా చేసిన డ్యాన్సర్. సేవాతనంలో ‘భోళా శంకరుడు’. ఇండస్ట్రీకి ఆయన్ని చూసి వచ్చే ఎంతో మందికి ‘ఆచార్య’.
అభిమానులకు ‘అన్నయ్య’.. విమర్శించేవాళ్ళకి తన వర్క్ తోనే సమాధానం చెప్పే ‘హిట్లర్’.. ఎంతోమందిని రక్తదానంతో కాపాడిన ‘ఆపద్భాందవుడు’.. వ్యక్తుల గురించి మాట్లాడొచ్చు కానీ ఓ శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గురించి తెలుసు. రికార్డులు ఆయనకు కొత్తకాదు. స్టార్ డమ్ ఆయన చూడనిది కాదు. నటన ఆయనకు తెలియనిది కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజులు ఏలుతున్నప్పుడే వచ్చి నిలబడ్డ ‘గ్యాంగ్ లీడర్’.
Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..
అలాంటి ‘కొండవీటి రాజా’ రాజకీయాల్లోకి వెళ్లి తనకి సరిపడక మళ్ళీ తిరిగొచ్చి సెకండ్ ఇనింగ్స్ లో ఇప్పటి జనరేషన్ తో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నా అసలు ఆయన స్టార్ డమ్ ని కళ్లారా చూడని పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలను ఆయన్ని తాకని స్థాయికి ఆయన ఈ జనరేషన్ పుట్టకముందే చేరుకున్నారు అని వాళ్లకు తెలియదు. ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. సినీ వినీలాకాశంలో మెగాస్టార్ ఒక్కడే.
సినిమా రిలీజ్ అవుతుందంటే మూడు రోజుల ముందే ఆన్లైన్ లో టికెట్స్ రిలీజ్ చేస్తే ఇంట్లో కూర్చొని ఫోన్లో టికెట్లు బుక్ చేసుకునే ఈ జనరేషన్ కి చిరంజీవి సినిమా వస్తుంది అంటే థియేటర్లో టికెట్ల కోసం చొక్కాలు చినిగిపోయినా లైన్ లో నిలబడి టికెట్ సాధిస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలీదు. మల్టీప్లెక్స్ లో కూర్చొని పాప్ కార్న్ తినుకుంటూ సినిమా చూసే ఈ జనరేషన్ కి తెరపై మెగాస్టార్ కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లిపోతుంది అనే విషయం తెలీదు. సెలబ్రిటీ కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతున్న ఈ జనరేషన్ కి చిరంజీవి వస్తున్నాడని తెలిసి గంటల ముందు నుంచే ఎదురుచూసి ఆయన కనపడితే చాలు దూరం నుంచి చూసి ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతాం అనుకోని వచ్చే ఆనందం వాళ్లకి తెలీదు. ఎంతైనా ఓ ఈవెంట్లో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పినట్టు చిరంజీవికి కూడా చిరంజీవి అభిమాని ఆనందం ఎలా ఉంటుందో తెలీదు.(Megastar Chiranjeevi)
Also Read : Bun Butter Jam : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..
ఆయన శరీరానికి 70 ఏళ్ళు వచ్చినా ఆయన మనసు ఇంకా చిన్న పిల్లాడే. ఆయనకు డబ్బు అవసరం లేదు, కావాల్సినంత సంపాదించేసాడు. పేరు ఆకాశం అంత వచ్చేసింది. ఫ్యామిలీ సినిమాల్లో ఉన్నారు. తమ్ముడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. కొడుకు స్టార్ హీరో అయ్యాడు. అయినా ఇంకా సినిమాలు చేస్తూ కష్టపడుతున్నాడంటే తనని ‘హీరో’గా కాకుండా ఒక ‘అన్నయ్య’గా చూస్తున్న మెగా అభిమానుల కోసమే. 70 కాదు వందేళ్లు వచ్చినా ఆయన సినిమాల్లోనే ఉంటారు, ఉండాలి అనేదే ప్రతి అభిమాని కోరిక.