కలెక్షన్ కింగ్ కమలానికి జైకొట్టారా? మోడీతో మీటింగ్‌లో ఏం చర్చించారు? బీజేపీలో చేరతారా అంటే.. ఇప్పుడేమీ చెప్పలేనంటూ మోహన్‌బాబు ఎందుకు దాటవేశారు?
కలెక్షన్ కింగ్ కమలానికి జైకొట్టారా? మోడీతో మీటింగ్‌లో ఏం చర్చించారు? బీజేపీలో చేరతారా అంటే.. ఇప్పుడేమీ చెప్పలేనంటూ మోహన్‌బాబు ఎందుకు దాటవేశారు? మోడీ ఫ్రెండ్‌షిప్‌తో టాలీవుడ్‌లో పెద్దన్న పాత్ర కోసం ట్రై చేస్తున్నారా? టాలీవుడ్ సీనియర్ హీరో, వైసీపీ కీలక నేత మంచు మోహన్‌బాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. కూతురు లక్ష్మీప్రసన్న, కొడుకు విష్ణు, కోడలు వెరోనికతో కలిసి పీఎంవోకు వెళ్లిన మోహన్‌బాబు… సుమారు 45 నిమిషాల పాటు ప్రధానితో మంతనాలు జరిపారు. అనంతరం బీజేపీ చీఫ్ అమిత్‌షాను కూడా కలిశారు. సీఏఏపై ప్రజల్లో అవగాన కల్పించే కార్యక్రమంలో అమిత్ షా బిజీగా ఉన్నప్పటికీ.. మోహన్‌బాబు ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించడం విశేషం. అమిత్‌షాతో భేటీ తర్వాత మోహన్‌బాబు కుటుంబం… హోం సెక్రటరీని కలవడం హాట్ టాపిక్‌గా మారింది.
గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో చేరింది. జగన్ తరఫున వారు పెద్దఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఒక దశలో మోహన్‌బాబుకు చిత్తూరు జిల్లా నుంచి ఏదో ఒక స్థానంలో టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. వైసీపీ భారీ మెజార్టీ సాధించి జగన్ సీఎం అయిన తర్వాత… మోహన్‌బాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారనే వార్తలొచ్చాయి. కానీ.. అవేవీ నిజం కాలేదు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీతో వెళ్లి మోదీని కలవడంతో… జగన్‌కు, మోహన్‌బాబుకు చెడిందేమోనన్న ఊహాగానాలు గుప్పుమన్నాయి. మంచు ఫ్యామిలీ బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగింది. కానీ కలెక్షన్ కింగ్ మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. జగన్‌ను కాదని… ఇక్కడికి రాలేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.
జగన్‌ను కాదని, మోదీని కలవలేదన్న మోహన్‌బాబు… బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. బీజేపీలోకి రావాలంటూ మోదీ నుంచి ఆహ్వానం అందిందా అంటే… ఇప్పుడు సమాధానం చెప్పలేనంటూ నవ్వుతూ దాటేశారు.
ఈ మధ్యే పాన్ ఇండియా సినీ నటులందరూ ప్రధాని మోదీని కలిసి.. రెండోసారి ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువ మంది బాలీవుడ్ వాళ్లే ఉండటం… సౌత్ యాక్టర్లకు అంతగా ప్రాధాన్యం దక్కక పోవడంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న, విష్ణు కలిసి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో త్వరలోనే సౌతిండియా నటీనటులతో భేటీ అవుతానని మోదీ హామీ ఇచ్చారన్నారు.
మొత్తానికి మంచు ఫ్యామిలీ బీజేపీలో చేరబోతుందా, లేదా అన్నది పక్కనపెడితే… మోదీతో తమకున్న ఆత్మీయతను ఉపయోగించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తుందా అనే చర్చ నడుస్తోంది.