Nee Dhaarey Nee Katha : ‘నీ దారే నీ కథ’ మూవీ రివ్యూ.. మ్యూజికల్ కథనంతో..

మ్యూజిక్ బ్యాండ్స్, ఆర్కెస్ట్రా రన్ చేసేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Nee Dhaarey Nee Katha Movie Review : ప్రియతమ్ మంతిని, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్.. ఇలా అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కిన సినిమా ‘నీ దారే నీ కథ’. సురేష్, అజయ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించారు. జెవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ నిర్మాణంలో వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నీ దారే నీ కథ సినిమా నేడు జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. అర్జున్ (ప్రియతమ్ మంతిని), తన ఫ్రెండ్ రాహుల్, విజయ్ లతో కలిసి ఓ మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటాడు. ISO అనే కాంపిటేషన్ లో గెలవాలని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్లకు సరైన టీమ్ ఉండదు. వెతికి వెతికి కొంతమందిని పట్టుకొని ఒక ఆర్కెస్ట్రా టీమ్ తయారుచేసుకొని ISO లో ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారు. కానీ అర్జున్ ఫ్రెండ్ రాహుల్ ఫ్యామిలీ, జాబ్ ప్రెజర్స్ వల్ల ఈ ఆర్కెస్ట్రా టీమ్ నుంచి తప్పుకుంటాడు. అదే సమయంలో మ్యూజిక్ క్లాసెస్ చెప్తూ మ్యూజిక్ షాప్ రన్ చేసే శృతి (అంజన బాలాజీ) ఈ టీమ్ లోకి వస్తుంది. ISO కాంపిటేషన్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే అర్జున్ వాళ్ళ నాన్న(సురేష్) చనిపోతారు. అర్జున్ ని అతని తండ్రి ఒక పెద్ద మ్యుజిషియన్ గా చూడాలనుకుంటాడు. మరి అర్జున్ తన డ్రీం, తండ్రి కోరిక నెరవేరుస్తాడా? ISO కాంపిటేషన్ గెలుస్తాడా? శృతి కథ ఏంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సాధారణంగా లైఫ్ లో ఒక డ్రీం పెట్టుకొని దాని కోసం ప్రయత్నించడం, మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలవడం అనే కథలు ఎప్పట్నుంచో ఉన్నవే. ఈ నీ దారే నీ కథ సినిమా కూడా అలాంటిదే. కాకపోతే ఈ సినిమా మొత్తం మ్యూజికల్ గా నడిపించారు. ఫస్ట్ హాఫ్ హీరో, అతని ఫ్రెండ్స్ మ్యూజిక్ బ్యాండ్ గురించి, శృతి గురించి, ISO కాంపిటేషన్ గురించి సాగుతుంది. సెకండ్ హాఫ్ హీరో నాన్న చనిపోవడం, హీరో ఏం చేసాడు అనేది సాగుతుంది. సినిమా మొదట్లో కాసేపు బోర్ కొట్టినా విజయ్ – సంజయ్ పాత్రలు మాత్రం అక్కడక్కడా నవ్విస్తాయి. ఈ సినిమా మొదట్నుంచి చివరి వరకు మ్యూజిక్ తోనే నడుస్తుంది. ఆ మ్యూజిక్ విషయంలో మాత్రం బాగానే హార్డ్ వర్క్ చేసారు. రకరకాల వాయిద్య పరికరాలతో ప్రయోగాలు చేసి మరి, రియల్ మ్యూజిషియన్స్ ని కూడా తెప్పించి కష్టపడ్డారు. సంగీతం టచ్ ఉన్న వాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ బ్యాండ్స్, ఆర్కెస్ట్రా రన్ చేసేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ లో తండ్రి ఎమోషన్ ని కూడా బాగా చూపించారు. క్లైమాక్స్ మాత్రం సంపూర్ణంగా ముగించకుండా సడెన్ గా ముగిసినట్టు అనిపిస్తుంది.

Also Read : Devara : ఎన్టీఆర్ అభిమానుల‌కు పండ‌గే.. చెప్పిన తేదీ కంటే రెండు వారాల ముందుగానే వ‌స్తున్న దేవ‌ర‌

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ అంతా కొత్తవాళ్లే. హీరోగా ప్రియతమ్ ఓకే అనిపించాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్, టీమ్ లో ఒకరిగా చేసిన సంజయ్.. ఇద్దరూ మాత్రం ఫుల్ గా నవ్విస్తారు. పోసాని కృష్ణమురళి ఒకే సీన్ లో కనిపించినా నవ్విస్తారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్ నటుడు సురేష్, తల్లి పాత్రలో చేసిన నటి.. ఇద్దరూ ఎమోషన్ తో మెప్పిస్తారు. ఫిమేల్ లీడ్ అంజనా పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ మైనస్ అవుతుంది. కెమెరా వర్క్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాల్సింది. మ్యూజిక్ మాత్రం అదిరిపోతుంది. సినిమా అంతా మ్యూజిక్ మీదే రన్ అవుతుంది కాబట్టి చాలానే కష్టపడ్డారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు డబ్బింగ్ కాకుండా సింక్ సౌండ్ వాడటం విశేషం. తక్కువ లొకేషన్స్ లో తక్కువ బడ్జెట్ లోనే ఒక ఆర్ట్ ఫామ్ సినిమా తీశారు అనిపిస్తుంది. దర్శకుడిగా వంశీ మొదటి సినిమా అయినా పర్వాలేదనిపించాడు.

మొత్తంగా జీవితంలో ఓ పెద్ద మ్యుజిషియన్ అవ్వాలనే ఓ కుర్రాడి కథని సంగీత ప్రధానంగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు