నాగార్జున నిర్మాణంలో, గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో, అఖిల్ హీరోగా నటించబోయే 5వ సినిమా రూపొందనుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతుంది..
అఖిల్… అక్కినేని మూడవ తరం నట వారసుడిగా అఖిల్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు.. హలో, Mr.మజ్ను సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే, సినిమా సినిమాకీ నటుడిగా తనని తాను సాన పెట్టుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అఖిల్ తర్వాతి సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
అఖిల్ హీరోగా నటించబోయే 5వ సినిమాను నాన్న నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తాడని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాకు గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకుడని తెలుస్తుంది. గీతగోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ బన్నీ, మహేష్‌లతో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. మహేష్‌తో సినిమా కోసం కథ చెప్పడం, ఆ స్టోరీ మహేష్‌ని అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.
అయితే ఇటీవలే పరశురామ్.. అఖిల్ కోసం మరో యూత్‌ఫుల్ సబ్జెక్ట్ వినిపించాడని, కథ నచ్చడంతో స్వయంగా నాగార్జునే నిర్మించనున్నాడని, తాను నిర్మాతగా అఖిల్‌తో తీసిన హలో నిరాశ పరచడంతో ఈసారి గట్టిగా హిట్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయ్యాడని, త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.