‘MAA’ ఎన్నికల హామీలు : చిరంజీవి కల్యాణలక్ష్మి, ఫించన్లు..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాదిరే పోటాపోటీ ప్రచారాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్‌ను పెంచేశాయి. రెండేళ్లకొకసారి జరిగే మా ఎన్నికల్లో గతంలో రాజేంద్రప్రసాద్ వర్సస్ జయసుధ ప్యానళ్లు మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా మీడియా ప్రాధాన్యత దక్కించుకున్నాయి. ఇప్పుడు కూడా నరేష్, శివాజీ రాజా ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఎన్నికలు అదే మాదిరి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also : ‘మా’ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా హేమ
‘మా’ ఎన్నికల తాయిళాల విషయంలో ఎవరు కూడా తగ్గట్లేదు. ఒకరిని మించి ఒకరు దూసుకెళ్తున్నారు. వృద్ద నటీనటులకు ‘మా’ తరపున ఇప్పటి వరకు ఇస్తున్న పింఛనును ఆరు వేలకు పెంచుతామంటూ నరేష్ ప్యానల్ ప్రకటించింది. నిరుపేద కళాకారుల ఆడపిల్లల పెళ్లిళ్లకు చిరంజీవి కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న మొత్తాన్ని లక్షా నూట పదహారుకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనికి పోటీగా శివాజీ రాజా వృద్ద నటీనటుల పింఛనును ఏడు వేల ఐదు వందలకు పెంచుతామని అన్నారు. తనను గెలిపిస్తే యాభై మంది నిరుపేద కళాకారులకు సంవత్సరానికి ఆరు మాసాల పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు.
సాధారణ ఎన్నికలకు మాదిరి హోరాహోరీ వాగ్ధానాలతో అభ్యర్ధులు పోటీ పడుతూ ఉంటే నాగార్జున, వెంకటేశ్ , ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ వంటి బడాస్టార్స్ ఏ గట్టునుంటారు అనే విషయం బయటకు రాలేదు. దీంతో మూవీ ఆర్టిస్టులు మా ఎన్నికల్లో ఏ ప్యానల్ కు పట్టం కడతారు అనేది ఉత్కంఠగా మారింది.
నరేశ్ ప్యానెల్ హామీలు :
> వృద్ద కళాకారులకు నెలకు రూ.6000 పించన్
> చిరంజీవి కళ్యాణ లక్ష్మీ కింద లక్షా నూట పదహారు రూపాయలు
> మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్
> సినీ కళాకారుల పిల్లలకు కేజీ టూ పీజీ ఉచిత విద్య
శివాజీరాజా ప్యానెల్ హామీలు :
> వృద్ద కళాకారులకు నెలకు రూ.7500 పించన్
> నిరుపేద కళాకారులకు ఏడాదికి 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు
>మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్
> కుటుంబ ఆదరణకు నోచుకోని వృద్ద నటుల కోసం వృద్ధాశ్రమం
> ‘మా’ అసోషియేషన్‌కు ప్రత్యేక కార్యాలయం నిర్మాణం