Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Narne Nithiin Sangeeth Shobhan Reba Monika John Mad Square Movie Review and Rating

Mad Square Movie Review : నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు మెయిన్ లీడ్స్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి మెప్పించిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ స్క్వేర్ సినిమా తెరకెక్కింది. అనుదీప్, రెబా మోనికా జాన్, సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే.. కథ మ్యాడ్ సినిమాకు మూడేళ్ళ తర్వాత కొనసాగింపుగా ఉంటుంది. ఇంజనీరింగ్ అయ్యాక మనోజ్(రామ్ నితిన్) బార్ టెండర్ గా, అశోక్(నార్నె నితిన్) వాళ్ళ ఆస్తి కోసం పోరాడుతూ, DD (సంగీత్ శోభన్) ఊళ్ళో సర్పంచ్ అవ్వాలని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి ఫిక్స్ అయిందని తెలియడంతో ముగ్గురు కలిసి పెళ్ళికి వెళ్తారు. కానీ లడ్డుని చేసుకోబోయే అమ్మాయి ఈ ముగ్గురితో కలిసి వచ్చిన ఇంకో అబ్బాయితో లేచిపోతుంది.

దీంతో లడ్డు బాధలో ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి గోవాకి తీసుకెళ్తారు. అదే సమయంలో గోవాలో ఓ పురాతనమైన నక్లెస్ దొంగతనం జరుగుతుంది. ఆ నక్లెస్ వీళ్ళే దొంగతనం చేసారని భాయ్(సునీల్) వీళ్ళని బెదిరిస్తాడు. అది వీళ్ళే చేశారేమో అని పోలీసులు వీళ్ళ వెంట పడతారు. లడ్డు పెళ్ళిలో ఏం జరిగింది? ఆ నక్లెస్ ఎవరు దొంగతనం చేసారు? వీళ్లంతా ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? గోవాలో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేసారు? భాయ్ నక్లెస్ కోసం ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Robinhood Twitter Review : నితిన్ ‘రాబిన్‌హుడ్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. డేవిడ్ వార్న‌ర్ రోల్ ఇదే!

సినిమా విశ్లేషణ.. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు.. మెయిన్ లీడ్స్ లో వచ్చిన మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు పెళ్లిలో ఫుల్ కామెడీతో నవ్విస్తారు. గోవాకి వెళ్ళాక అక్కడ వీళ్ళు నక్లెస్ కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ మీద ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి నక్లెస్ కోసం వెతకడం, పోలీసులు వీళ్ళ కోసం వెతకడంతో సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో మ్యాడ్ సినిమా రేంజ్ లో ఫుల్ గా నవ్వించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ నవ్వులు కాస్త తగ్గుతాయి. ప్రమోషన్స్ లో కథ, లాజిక్ లు వెతకొద్దు అని ముందే చెప్పేసారు. అవి వెతక్కపోయినా కామెడీ మాత్రం ఉండాలి. కానీ సెకండ్ హాఫ్ లో క్రైం లింక్ పెట్టి కామెడీ లో కాస్త తడబడ్డారు. ఇక క్లైమాక్స్ అయితే ఏదో ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి నార్నె నితిన్ ని హైలెట్ చేసినట్టు చూపించాలని కొన్ని సీన్స్ రావడంతో అప్పటిదాకా యూత్ ఫుల్ ఫన్ గా సాగిన సినిమా ఒక్కసారిగా హీరోయిక్ సినిమాలా మారిపోతుంది.

మ్యాడ్ సినిమా అంత కాకపోయినా మ్యాడ్ స్క్వేర్ లో నవ్వించడానికి బాగానే ట్రై చేసారు. ఇక మ్యాడ్ క్యూబ్ అనౌన్స్ చేయడం గమనార్హం. పవన్, ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా అక్కడక్కడా వారి రిఫరెన్స్ లు తీసుకున్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఫస్ట్ పార్ట్ లో అదరగొట్టిన సంగీత్ శోభన్, విష్ణు ఇందులో కూడా తమ యాక్టింగ్ తో, కామెడీ టైమింగ్ తో అదరగొట్టి ఫుల్ గా నవ్విస్తారు. నార్నె నితిన్, రామ్ నితిన్ అక్కడక్కడా నవ్విస్తూనే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ప్రియాంక జవాల్కర్, అనుదీప్ చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు. సునీల్ భాయ్ పాత్రలో ఓకే అనిపిస్తారు. శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, మురళీధర గౌడ్, రఘుబాబు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. రెబా మోనికా ఐటెం సాంగ్ లో అదరగొట్టింది.

Also Read : Veera Dheera Soora : ‘వీర ధీర శూర’ మూవీ రివ్యూ.. ఒక్క రాత్రిలో జరిగే థ్రిల్లింగ్ కథ..

సాంకేతిక అంశాలు.. సితార నిర్మాణ సంస్థ అంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటుందని తెలిసిందే. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. గోవా లొకేషన్స్ ని బాగానే చూపించారు. అన్ని పాటలు అదిరిపోయాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సింపుల్ కథ అయినా మంచి స్క్రీన్ ప్లేతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. పంచ్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా మ్యాడ్ అంత కాకపోయినా బాగానే నవ్వించారు. ఫ్యామిలీతో కలిసి కాసేపు నవ్వుకోడానికి వెళ్లొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.