Disha encounter: ఇది దిశ బయోపిక్ కాదు.. నిర్మాత నట్టి కుమార్

  • Publish Date - October 10, 2020 / 04:51 PM IST

Disha encounter: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఏం మాట్లాడినా వివాదమే.. ఏం చేసినా వివాదమే. యదార్ధ సంఘటనల ఆధారంగా తనదైన స్టైల్‌లో సినిమాలు తెరకెక్కించే వర్మ.. యావత్ భారతదేశంలో కలకలం రేపిన హత్యాచార ఘటన ఆధారంగా.. ‘దిశా ఎన్‌కౌంటర్’ అనే సినిమా తెరకెక్కించాలని రెడీ అయ్యాడు. దిశ పోస్టర్‌తో పాటు ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశాడు.


శంషాబాద్‌సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర నలుగురు మానవ మృగాళ్లు ఒక యువతిపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత నిందితుల ఎన్‌కౌటర్‌జరిగిన తీరు ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దిశ ఎన్‌కౌంటర్‌అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


అయితే ఈ మూవీని ఆపాలంటూ బాధితురాలి తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. దిశ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ చేస్తున్న సమయంలో ఇలా సినిమా చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారాయన.


దిశ సంఘటనతో తమ కుటుంబమంతా దుఃఖంలో మునిగిపోయిందని.. ఇలాంటి సమయంలో వర్మ సినిమా తీయడం సరికాదన్నారు. దీంతో పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.


‘‘దిశా ఎన్‌కౌంటర్‌’ సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డ్‌ సూచనలు పాటిస్తాం. సినిమాను సినిమాలా చూడాలి. ఏవైనా సీన్స్‌ కట్‌ చేయమంటే కట్‌ చేస్తాం. కోర్ట్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకుంటాం. మేం తీస్తుంది దిశ బయోపిక్ కాదు. దిశ తల్లిదండ్రుల్ని బాధపెట్టేలా ఈ సినిమా తీయలేదు. సమాజంలో జరిగిన అత్యాచార ఘటనను మాత్రమే చూపించబోతున్నాం. దిశ కమిషన్ కు సంబంధించిన విషయాలు చిత్రం లో ఏమి చెప్పలేదు.. నిజం నిర్భయంగా ఈ చిత్రంలో చూపించాము.. సినిమా మొత్తం ఒక గంట 50 నిముషాలు ఉంటుంది’’ అన్నారు.