Site icon 10TV Telugu

28°C Movie Review : ’28°C’ మూవీ రివ్యూ.. లవ్ థ్రిల్లర్.. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

Naveen Chandra Shalini Vadnikati Dr. Anil Vishwanath 28°C Movie Review and Rating

Naveen Chandra Shalini Vadnikati Dr. Anil Vishwanath 28°C Movie Review and Rating

28°C Movie Review : వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి అభిషేక్ నిర్మాణంలో పొలిమేర డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’28°C’. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ’28°C’ సినిమా నేడు ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ప్రియదర్శి, రాజా రవీంద్ర, హర్ష చెముడు, దేవియని శర్మ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. కార్తీక్(నవీన్ చంద్ర) అంజలి(షాలిని వడ్నికట్టి) మెడిసిన్ చదివేటప్పుడు ప్రేమలో పడతారు. కార్తీక్ అనాథ అవ్వడం, వేరే కులం కావడంతో అంజలి వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోరు. దాంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అంజలి కి టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య వస్తుంది. తన బాడీ ఎప్పుడూ 28 డిగ్రీల సెల్సియస్ వద్దే ఉండాలి. అంతకంటే బాగా తగ్గినా, పెరిగినా పెరలాసిస్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కార్తీక్ అంజలిని జాగ్రత్తగా చూసుకుంటాడు.

జార్జియాలో ఈ సమస్యకు ఓ డాక్టర్ రీసెర్చ్ చేస్తున్నాడని తెలిసి ఇద్దరూ అక్కడికి షిఫ్ట్ అవుతారు. అంజలి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇద్దరూ అక్కడ ఓ హాస్పిటల్ లో పనిచేస్తారు. ఓ రోజు కార్తీక్ ఇంటికొచ్చేసరికి అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయాక ఆ ఇంట్లో అనుమానాస్పద సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంజలి ఎలా చనిపోయింది? అంజలి చనిపోయాక కార్తీక్ ఏమయ్యాడు? అంజలికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? అంజలి చనిపోయాక ఇంట్లో ఏం జరుగుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : LYF – Love Your Father : ‘లైఫ్ – లవ్ యువర్ ఫాదర్’ మూవీ రివ్యూ.. తండ్రి కొడుకుల అనుబంధంతో డివోషనల్ టచ్ ఇచ్చి..

సినిమా విశ్లేషణ.. ఇది ఆరేళ్ళ క్రితం సినిమా. పొలిమేరతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాధ్ మొదటి సినిమా కావడం గమనార్హం. పలు కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ ఇప్పటికి రిలీజ్ అయింది. కరోనా తర్వాత థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ప్రేక్షకుల మైండ్ సెట్, సినిమా చూసే స్టైల్ కూడా మారింది. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి అప్పటి మైండ్ సెట్ కి తగ్గట్టు చూస్తే సినిమా బాగానే ఉంటుంది. అప్పటికి లవ్ థ్రిల్లర్ అంటే కాస్త కొత్తగా ఉన్నట్టే.

ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ – అంజలి లవ్ స్టోరీ, మెడికల్ కాలేజీ, ఫ్రెండ్స్, కార్తీక్ – అంజలి పెళ్లి, జార్జియాకి వెళ్లడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి అంజలి చనిపోవడంతో నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తి నెలకొంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ మీదే నడవడంతో కాస్త బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉంటుంది. అంజలి చనిపోయాక ఇంట్లో అనుమానాస్పదంగా సంఘటనలు జరుగుతుండటంతో కార్తీక్ అది ఏంటి, ఎలా కనిపెట్టాడు అని థ్రిల్లర్ గా నడిపించారు. సెకండ్ హాఫ్ హారర్, థ్రిల్లింగ్ అనుభవం ఇస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి లవ్ సన్నివేశాలు మాత్రం రొటీన్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా భయపెడతారు. వైవా హర్ష, ప్రియదర్శిలతో అక్కడక్కడా కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. నవీన్ చంద్ర – షాలిని వడ్నికట్టి జంట క్యూట్ కపుల్ గా మెప్పిస్తుంది. ప్రియదర్శి, వైవా హర్ష అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియని శర్మ ఆసక్తికర పాత్రలో కనిపిస్తుంది. అభయ్, రాజా రవీంద్ర, జయప్రకాశ్, సంతోషి శర్మ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Buchibabu Sana : ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల గిఫ్ట్..

సాంకేతిక అంశాలు.. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ అప్పటి కెమెరాలకు తగ్గట్టు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. పాటలు యావరేజ్. జార్జియా, వైజాగ్ లో కొన్ని లొకేషన్స్ బాగా చూపించారు. ఇప్పటికి ఇది పాత కథే అయినా ఆరేళ్ళ క్రితం మాత్రం ఇది కొత్త కథే. కొత్త పాయింట్ ని ఆసక్తికర కథనంతో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు అనిల్. నిర్మాణ పరంగా అప్పట్లో ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ’28°C’ సినిమా ఓ వ్యక్తికి ఒక టెంపరేచర్ వద్దే బతకగలిగే సమస్యతో బాధపడితే ఏం జరిగింది అని ఓ కొత్త పాయింట్ తో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version