ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా సాంగ్ విడుదల

  • Publish Date - September 3, 2019 / 03:33 PM IST

ఒక దైవ ర‌హ‌స్యం.. ఒక ఇతిహాస త‌రంగం ‘తూనీగ’. అతిత్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా లిరిక‌ల్ సాంగ్ వీడియోని ఏపీఐఐసీ ఛైర్మ‌న్, ప్రముఖ నటి రోజా సెల్వమణి విడుద‌ల చేసి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు.

శ్రీకాకుళం యువకులు ఎంతో కష్టపడి తీస్తున్న ఈ సినిమా ఘ‌న విజ‌యం అందుకోవాలని, కొత్త ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ మ‌రిన్ని వినూత్న క‌థా చిత్రాల‌ను రూపొందించాలని ఆకాంక్షించారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను ప్రోత్స‌హించడంలో తానెన్న‌డూ ముందుంటాన‌ని ఆమె చెప్ప‌ారు.

వినీత్ చంద్ర‌, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న తూనీగ సినిమా కోసం శ్రమిస్తున్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. హృద‌యం హృద‌యం క‌లిపిందీ క్ష‌ణం.. అనే ప‌ల్ల‌వితో సాగే ఈ మొద‌టి పాట‌కు సంబంధించిన సాహిత్యాన్ని బాలాజీ అందించగా.. హ‌రిగౌర పాట‌ను పాడారు. క్ష‌ణం సినిమా ఫేం సిద్ధార్థ్ స‌దాశివుని స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఆద్యంతం మైమరిపించే సంగీతం, చ‌క్క‌ని భావాల‌తో సాగిపోయే ఈ పాట త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ అన్నారు. త్వ‌ర‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.