నో షా..సుల్తాన్…హోంమంత్రి హిందీ వ్యాఖ్యలపై కమల్ ఫైర్

సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ  రాజకీయ పార్టీల నేతలు అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకె, జేడీఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పుడు మక్కళ్‌నీది మయ్యం కూడా ఆ జాబితాలో చేరింది. 

ఒక దేశం ఒక భాష అంటూ  అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం(సెప్టెంబర్-16,2019) ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఒక దేశం ఒకే భాష అనే విధానం సరైనది కాదు. భారత్‌ ప్రజాస్వామ్య దేశం కావున ఒక దేశం అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేశ జాతీయ గీతం బెంగాళీ భాషలో ఉన్నా.. అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను సంస్కృతిని గౌరవిస్తుంది. కావున దానిని మేమంతా గౌరవిస్తాం. రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం సరికాదు. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతంగా చేశామో దేశమంతా చూసింది. తమిళ భాష జోలికి వస్తే దానికి కంటే మరింత ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ కమల్‌ హసన్‌ హెచ్చరించారు. 

భారతదేశం రిపబ్లిక్ అయినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రమాణాన్ని చేశామని,ఇప్పుడు ఇప్పుడు షా, సుల్తాన్ లేదా సామ్రాట్ ఆ వాగ్దానాలను తిరస్కరించకూడదని కమల్ అన్నారు. జల్లికటు కేవలం నిరసన మాత్రమేనని… భాష కోసం యుద్ధం విపరీతంగా పెద్దదిగా ఉంటుందన్నారు. భారతదేశానికి లేదా తమిళనాడుకు అలాంటి యుద్ధం అవసరం లేదన్నారు. తాము అన్ని బాషలను గౌరవిస్తామని,కానీ తమ మాతృబాష ఎప్పటికీ తమిళ్ మాత్రమేనని కమల్ అన్నారు.