Paradha Review
Paradha Review : అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా పరదా. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాణంలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దర్శన రాజేంద్రన్, సంగీత, రాజ్ మయూర్, రాజేంద్రప్రసాద్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. పరదా సినిమా నేడు ఆగస్టు 22న థియేటర్స్ లో రిలీజయింది.(Paradha Review)
కథ విషయానికొస్తే.. పడతి గ్రామంలో అక్కడ జ్వాలమ్మ అమ్మవారి కథని ఆధారంగా చేసుకొని ఊళ్ళో అమ్మాయిలంతా ముఖంపై పరదాలు కప్పుకొనే తిరగాలి. పరదా తీసేస్తే ఆ ఊళ్ళో పిల్లలు పుట్టరు అనే శాపం ఉందని నమ్మకం. ఎవరైనా పరదా తీసేస్తే వారిని ఆత్మహుతి పేరుతో చంపేస్తారు. ఆ ఊళ్ళో సుబ్బు(అనుపమ) అదే ఊరి ప్రసిడెంట్ కొడుకు రాజేష్(రాగ్ మయూర్) ప్రేమించుకొని పెళ్ళికి రెడీ అవుతారు. నిశ్చితార్థం రోజున సుబ్బు ఫోటో ఓ మ్యాగజైన్ మీద కవర్ ఫోటోగా కనిపిస్తుంది. ఆ సమయంలో మూడు వారాల్లో స్రవంతి బిడ్డని కనడానికి రెడీగా ఉంటుంది. ఆ బిడ్డ బతకాలని, సుబ్బు పరదా తీసి తప్పు చేసిందని, సుబ్బుని ఆత్మహుతి చేయాలని ఊరంతా తీర్మానిస్తుంది.
ఆ నిశ్చితార్థానికి వేరే ఊరు నుంచి వచ్చిన సుబ్బు అత్త రత్న(సంగీత) చంపేయడం ఏంటి అని అందరితో గొడవపడినా, సుబ్బు తానేం తప్పు చేయలేదని మొత్తుకున్నా ఎవరూ వినరు. ఆమెని ఆత్మహుతి చేసేముందు జ్వాలమ్మ దగ్గర అగ్నిగుండం ఆరిపోవడంతో ఆమె తప్పు చేయలేదేమో అని కొంతమంది సందేహించి ఆ ఆత్మహుతిని ఆపి ఆ ఫోటోగ్రాఫర్ ని పట్టుకొచ్చి నువ్వు ఫోటో తీయించుకోలేదని నిజం చెప్పించు కానీ ఈ ఊరి వాళ్ళు ఎవరూ నీకు సాయం చేయరు, నువ్వు పారిపోవాలని చూస్తే మీ నాన్న ఇక్కడే ఉంటాడు అని చెప్తారు.
దీంతో రత్న, సుబ్బు ఢిల్లీ వెళ్లి అక్కడ రత్న ఫ్రెండ్ కూతురు అమిష్ట(దర్శన రాజేంద్రన్)తో కలిసి ఫోటోగ్రాఫర్ ని పట్టుకోడానికి ధర్మశాలకు బయలుదేరుతారు. మరి ఈ ముగ్గురు మహిళలు ఫోటోగ్రాఫర్ ని పట్టుకున్నారా? ఈ ప్రయాణంలో వీరికి ఎదురైన సమస్యలు ఏంటి? ఆ ఊళ్ళో అసలు పరదా ఆచారం ఎలా వచ్చింది? స్రవంతి బిడ్డ పుట్టిందా? ఆ ఊళ్ళో పరదా ఆచారం తీసేస్తారా? అసలు సుబ్బు ఫోటో ఆ మ్యాగజైన్ మీదకు ఎలా వచ్చింది, రాజేష్ – సుబ్బుల పెళ్లి జరుగుతుందా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Bun Butter Jam : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..
ఇన్నాళ్లు సినిమాల్లో క్యూట్ గా లవ్ స్టోరిలలో కనిపించిన అనుపమ మొదటి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం, పరదా అని మొహాన్ని కప్పేసి ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అసలు కథ మొత్తం మొదటి 40 నిమిషాలకే అయిపోతుంది. ఫోటో తీసి మ్యాగజైన్ మీద వేసిన ఫోటోగ్రాఫర్ ని పట్టుకోడానికి బయలుదేరడంతోనే కథ అయిపోయింది అని తెలుస్తుంది. ఇక అక్కడ్నుంచి ఓ గంట సేపు బాగా సాగదీశారు. హిమాలయాలు, ధర్మశాల, మనాలి.. ఇవన్నీ తిరుగుతూ ఓ ట్రావెల్ వ్లోగ్ గా చూపించారు. అసలు కథకు ఆ ప్రదేశాలకు సంబంధం ఉండదు.
ఆ ఫొటోగ్రఫర్ ని ఏ ఢిల్లీలోనో, ఏ హైదరాబాద్ లోనో పెట్టుకొని వెతుక్కోవచ్చు కానీ అక్కడ ధర్మశాలలో ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. అమ్మాయిలు పరదాలు వేసుకొని తిరగాలి అనే పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ ఆచారాలు, నమ్మకాలు రాసుకొని మహిళల సమస్యలు, అవి తీరాలి, మహిళలు ఇండిపెండెంట్ గా బతకాలి అనే రొటీన్ కథనంతో సాగదీశారు. పరదా గురించి సినిమా అంతా మాట్లాడి, బోలెడు డైలాగ్స్ చెప్పిన దర్శకుడు ఓ బురఖా షాట్ చూపించి మరీ ఎక్కడా బురఖా గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
రాగ్ మయూర్ పాత్ర మొదట్నుంచి బాగా చూపించి చివర్లో సడెన్ గా క్యారెక్టర్ ఎందుకు మారిపోతుందో అర్ధం కాదు. ఇక సంగీత పాత్రని బయట కొంతమంది భార్యల రియల్ గృహిణి నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. దర్శన క్యారెక్టర్ కి సరైన ముగింపు ఉండదు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఓ గెస్ట్ పాత్రలో వచ్చి ఓ లెక్చర్ ఇప్పించి పంపించారు. అనుపమ పాత్ర పరదా తీసేయడానికి ఓ బలమైన కారణం చూపించినా దానికి తగ్గ డైలాగ్స్ రొటీన్. చివరి 20 నిముషాలు హీరోయిన్ వచ్చి మొత్తం మార్చేసిందని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హైప్ ఇచ్చి గ్రాండ్ గా కమర్షియల్ సినిమాల్లోలాగా ఎలివేషన్స్ తో మంచి ముగింపు అయితే ఇచ్చారు.
‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అనే శ్లోకాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏదో ఎలివేషన్ కోసం వాడేశారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి. మొత్తానికి మొదటి 40 నిముషాలు ఏదో ఉండబోతుందని కథ బాగానే నడిపినా క్లైమాక్స్ ఏదో ఉంటుంది అని గంట సేపు హిమాలయ ట్రావెల్ వ్లోగ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. కంటెంట్ సినిమా అని డైరెక్టర్, మూవీ యూనిట్ బాగా ప్రచారం చేసారు మరి. ఈ కంటెంట్ సినిమా ఎంతమందికి కనెక్ట్ అవుతుందో చూడాలి.(Paradha Review)
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మొహం మీద ఆల్మోస్ట్ సగం సినిమా అంతా పరదా కప్పుకొనే సీన్స్ ని పండించడమంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాకు మొదటి బలం అనుపమనే. ఇక సంగీత ఓ మాములు గృహిణి పాత్రలో బాగానే మెప్పించింది. దర్శన రాజేంద్రన్ మగాళ్లతో పోటీ పడే ఫెమినిస్ట్ పాత్రలో పర్వాలేదనిపించింది. జ్ఞానేశ్వరి కాండ్రేగుల చివర్లో సోల్జర్ పాత్రలో కనపడి మంచి పాత్రతో మెప్పించింది.
రాజేంద్ర ప్రసాద్ జస్ట్ గెస్ట్ అప్పీరెన్స్ మాత్రమే. రాగ్ మయూర్ తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు కానీ ఆ క్యారెక్టర్ ని దర్శకుడు ఎందుకు సడెన్ గా మార్చేసాడో అర్ధం కాదు. గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. చైతన్య రావు కూడా గెస్ట్ అప్పీరెన్స్ లో మెప్పిస్తాడు. హర్షవర్ధన్ తో కామెడీ ట్రై చేసినా ఓకే అనిపించింది. మిగిలిన నటీనటులు, ఊళ్లోని పాత్రలు అంతా బాగానే నటించారు. ఊళ్ళో ఉన్న మహిళలు అంతా పరదాలు వేసుకొని మరీ నటించే విషయంలో వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు అనుపమ తర్వాత సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు కానీ కొన్ని చోట్ల అవసర్లేకపోయినా యత్ర నార్యస్తు పూజ్యంతే ని వాడినట్టు అనిపిస్తుంది. రానా ఈ సినిమా చూసి ఆల్రెడీ ఎడిటింగ్ లో పావుగంట పైగా తీసేయమని చెప్పినట్టు ప్రమోషన్స్ లో చెప్పారు. ఎడిటర్ ఇంకొన్ని ల్యాగ్ సీన్స్, అక్కర్లేని సీన్స్ కూడా ఎడిట్ చేయాల్సింది. మహిళల జీవితాలు మారాలి అనే రెగ్యులర్ కాన్సెప్ట్ ని నార్త్ పరదా కాన్సెప్ట్ ని తీసుకొని ఇక్కడ ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి దర్శకుడు బాగా కష్టపడ్డాడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.
మొత్తంగా ‘పరదా’ సినిమా ఇంకా కొన్ని చోట్ల మహిళలను కంట్రోల్ చేస్తున్నారని, వాళ్లకు స్వేచ్ఛ లేదని, మూఢ నమ్మకాలతో వాళ్ళను కట్టడి చేస్తున్నారని ఓ మెసేజ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.