Peddarayudu
నట ప్రపూర్ణ, డా.మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ ‘పెదరాయుడు’ చిత్రం నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..
‘పెదరాయుడు’.. కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, డా.మోహన్ బాబు కెరీర్లో ఓ మైల్ స్టోన్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం 15 జూన్ 1995న విడుదలైంది. 15 జూన్ 2020 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ‘పెదరాయుడు’ చిత్ర విశేషాలు..
తమిళనాట కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, శరత్ కుమార్, విజయ్ కుమార్, ఖుష్బూ, మీనా తదితరులు ప్రధాన పాత్రలో నటించగా 1994లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘Nattamai(నటామై)’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ‘పెదరాయుడు’.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నటించి, నిర్మించారు. పెదరాయుడు, రాజాగా ఆయన ద్విపాత్రాభినయం చేయగా రజినీకాంత్ పోషించిన పాపారాయుడు క్యారెక్టర్ సినిమాకు వెన్నెముకలా నిలిచింది.
సౌందర్య, భానుప్రియ, ఆనంద్ రాజ్, రాజా రవీంద్ర, బ్రహ్మానందం, జయంతి, చలపతిరావు, ఎమ్.ఎస్.నారాయణ, బాబూ మోహన్, శుభశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. జి.సత్యమూర్తి రాసిన మాటలు, కోటి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఇప్పటికీ అలరిస్తుంటాయి. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
‘పెదరాయుడు’ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన అరుదైన వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు మోహన్ బాబు.. ఎన్టీఆర్ ఈ చిత్రానికి క్లాప్ నివ్వడం విశేషం. దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మూవీ మెఘల్ డి.రామానాయుడు వంటి అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
25 Years of Pedarayudu! What Memories!#Pedarayudu #25YrsOfPedarayudu pic.twitter.com/mIbMMpowET
— Mohan Babu M (@themohanbabu) June 15, 2020