Perni Nani
Perni Nani : సినిమా టికెట్ రేట్లు పెంచిన జీవో వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, దానయ్య ఇటీవల జగన్ ని, మంత్రి పేర్ని నాని ని కలిశారు. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంది కనుక మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమని అడిగేందుకు వారు వెళ్లారు. అయితే ఈ మీటింగ్ అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ”కొత్త జీవో వచ్చిన తర్వాత సీఎంని కలిసి థ్యాంక్స్ చెప్పేందుకు రాజమౌళి, డి.వి.వి.దానయ్య వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగలేదు. సినిమా రిలీజ్ అయినప్పుడల్లా సినిమా పరిశ్రమ వాళ్ళు ఎందుకు కలుస్తారు” అంటూ అన్నారు.
అయితే అదే రోజు రాజమౌళి మీడియాతో దీనికి భిన్నంగా మాట్లాడుతూ.. ”‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడాము. ఈ సినిమా బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి ఆ సినిమాకి ఏమిచేయలో అది చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు” అని తెలిపారు. టికెట్ రేట్లు పెంచమని అడిగినట్టు ఇండైరెక్ట్ గా తెలిపారు. తాజాగా ఇవాళ పేర్ని నాని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ల విషయం పై, సినిమా పరిశ్రమపై మీడియాతో మాట్లాడారు.
పేర్ని నాని మాట్లాడుతూ.. ”ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దర్శకులు రాజమౌళి, నిర్మాత దానయ్య వచ్చి సినిమాకి టికెట్ రేట్లు పెంచమని అప్లికేషన్ పెట్టుకున్నారు. మేము గతంలో ఇచ్చిన జీవో ప్రకారం సినిమా బడ్జెట్ లో హీరో, డైరెక్టర్, హీరోయిన్ రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్లు బడ్జెట్ దాటితే మొదటి పది రోజులు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పాము. హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్, జీఎస్టీ కాకుండా ఈ సినిమా ఖర్చు 336 కోట్లు అయిందని తెలుపుతూ వారు అప్లికేషన్ ఇచ్చారు.”
”వారు ఇచ్చిన అప్లికేషన్ ని జీఎస్టీ డిపార్ట్మెంట్, రెవెన్యూ కార్యదర్శికి పంపించాము. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఉంటుంది. వీరంతా వారు ఇచ్చిన అప్లికేషన్ ని వెరిఫై చేస్తారు. ఆ తర్వాత టికెట్ రేటు ఎంత పెంచుకోవాలో నిర్ణయిస్తాము. పెంచిన రేటు ప్రజలకి భారం లేకుండానే డిసైడ్ చేస్తాము.ఈ కొత్త జీవో వచ్చేసరికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ అయిపొయింది కాబట్టి వారి అప్లికేషన్ ని పరిగణలోకి తీసుకున్నాం. లేకపోతే మేము ఇచ్చిన జీవోలో 20 శాతం షూటింగ్ ఆంధ్రాలో జరగాలి అన్న కండిషన్ ని కచ్చితంగా ఫాలో అవుతాము. ఈ జీవో రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ చేసే సినిమాలకి ఈ కండిషన్ వర్తిస్తుంది”
Rajamouli : పేర్ని నాని అలా.. రాజమౌళి ఇలా.. ఇంతకీ ఎందుకు కలిసినట్టో??
”ఇలాంటి భారీ సినిమాలకి టికెట్ రేట్లు పెంచేసి మొదటి నాలుగు రోజుల్లో డబ్బులు సంపాదించాలని డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచిస్తారు. కానీ ప్రజలకి భారం పడకుండా మేము నిర్ణయం తీసుకుంటాము. మంచి సినిమాలని ఎంకరేజ్ చేస్తాము. అలాగే టికెట్ రేట్లని మొదటి పది రోజులు మాత్రమే పెంచుకునే వెసలుబాటు ఇస్తాము. అయిదు షోలు ప్రదర్శించుకోవచ్చు ఇచ్చిన టైమింగ్ లో.”
Rajamouli : కాసేపట్లో జగన్‌ని కలవనున్న రాజమౌళి, దానయ్య.. ఈ మీటింగ్ ఎందుకో??
”అలాగే ఆన్లైన్ టికెట్ సిస్టంకి టెండర్లు వచ్చాయి. అందులో రెండు టెండర్లని ఫైనల్ చేశాము. వారితో మాట్లాడి మే లోపు ఆ ప్రక్రియని పూర్తి చేస్తాము. ఫిలిం కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అదే పనిలో ఉంది. అది ఫైనల్ అయ్యాక మళ్ళీ మీడియా సమావేశం పెడతాము. అలాగే షూటింగ్స్ కి ఎలాంటి ఛార్జ్ తీసుకోకుండా సింగిల్ విండో పర్మిషన్లు ఇస్తున్నాము” అని తెలిపారు.
Perni Nani: ‘రాజమౌళి, దానయ్యలు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడలేదు’
ఈ సమావేశంలో పేర్ని నాని మాట్లాడిన దాని బట్టి చూస్తే కచ్చితంగా ఏపీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ‘ఆర్ఆర్ఆర్’ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఇటీవల విడుదల అయి భారీ విజయం సాధించిన సినిమాలకి ఏపీలో కలెక్షన్స్ తక్కువగానే వచ్చాయి. ఈ సారి టికెట్ పెంపుపై ఓకే అంటే ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి ఢోకా ఉండదు.