వావ్.. పవర్‌స్టార్ లైనప్ మామూలుగా లేదుగా!..

Powerstar Pawan Kalyan Birthday Special Updates: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీలో పవన్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. పవర్ స్టార్ సినిమాల లైనప్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన 26వ సినిమాగా ‘వకీల్ సాబ్’ చేస్తున్నారు పవన్. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్ 2) పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. లాయర్ గెటప్‌లో పవన్ లుక్ అదిరిపోయిందంటూ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.దీంతోపాటు పవన్ కళ్యాణ్ 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజయస్ పీరియాడికల్ డ్రామా షూటింగ్ కొద్దిరోజుల క్రితం ప్రారంభమైంది. కరోనా రావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీని తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. పవర్ స్టార్ 28వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ అనే క్యాప్షన్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు.
అలాగే పవర్ స్టార్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు. పవన్ 29వ సినిమా ఇది. ప్రముఖ పారిశ్రామికవేత్త, పవన్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాపులర్ రైటర్ వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.
మొత్తానికి ఈ పుట్టినరోజు నాడు రెండు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్, మరో రెండు అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు పవర్ స్టార్..