Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..

కల్కి సినిమా ముందు నుంచి కలియుగాంతం, మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేసారు.

Kalki 2898 AD Review : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు (జూన్ 27న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజయింది. కల్కి సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్ నటీనటులు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటించారు.

కథ విషయానికొస్తే..
కలియుగాంతంలో మిగిలిన మనుషులు ప్రపంచంలోని చివరి నగరంగా కాశిలో బతుకుతుంటారు. మరో పక్క భూమి మీద వనరులు అన్ని లాక్కొని కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టించి అన్ని తానై నడిపిస్తాడు సుప్రీమ్ యాస్కిన్(కమల్ హాసన్). మరో పక్క దేవుడు ఎప్పటికైనా పుడతాడు, ప్రపంచాన్ని కాపాడతాడు అని నమ్ముతూనే కాంప్లెక్స్ మనుషులని అంతం చేయాలని కొంతమంది ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా శంబాలా నగరంలో మరియమ్మ(శోభన) ఆధ్వర్యంలో బతుకుతుంటారు. కాశీలో ఉండే భైరవ బౌంటీ హంటర్(డబ్బుల కోసం పనిచేసే రౌడీ షీటర్ లాంటి వాళ్ళు) గా పనిచేస్తూ ఎప్పటికైనా మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లాలని అనుకుంటాడు. కాంప్లెక్స్  ప్రపంచంలో ప్రెగ్నెన్సీకి పనికొచ్చే మహిళలని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడి నుంచి SUM 80 (దీపికా పదుకోన్) అనుకోని పరిస్థితుల్లో తప్పించుకుంటుంది. దీంతో ఆమెని పట్టుకుంటే మిలియన్ యూనిట్స్ ఇస్తామని చెప్పడంతో ఆమెని అందరూ వెంటాడుతారు. దీంతో చిరంజీవిగా ద్వాపరయుగం నుంచి బతుకుతున్న అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ఆమెని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. భైరవ కూడా ఆమెని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు.

అశ్వత్థామ, SUM 80తో కలిసి ఎక్కడికి వెళ్లారు? అశ్వత్థామకు ఉన్న శాపం ఏంటి? ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు? భైరవ – అశ్వత్థామ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? శంబాలాలో ఏం జరుగుతుంది? కాంప్లెక్స్ మనుషులు శంబాలాని ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? భైరవ ఎవరు? అతను SUM 80ని పట్టుకున్నాడా? ఇంతకీ కల్కి SUM 80 (దీపికా)కు పుడుతున్నాడని ఎలా తెలుస్తుంది? కలియుగాంతానికి మహాభారతానికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Kalki 2898 AD Twitter Review : ‘కల్కి’ ట్విట్టర్ రివ్యూ.. పూన‌కాలే అంటున్న నెటిజ‌న్లు..

సినిమా విశ్లేషణ..
కల్కి సినిమా ముందు నుంచి కలియుగాంతం, మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేసారు. ప్రమోషన్స్ తగ్గట్టే చాలా కొత్త కథని చూపించారు. అసలు కలియుగాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది? భూమి మీద వనరులు అన్ని నాశనమయ్యాక మనుషులు ఎలా బతుకుతారు? అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుంది అన్నట్టు చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాశిలో మిగిలిన మనుషులు, కాంప్లెక్స్ చూపించి భైరవ కాంప్లెక్స్ కి వెళ్ళే ప్రయత్నాలు చూపిస్తారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా హై రేంజ్ లో ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ లో SUM 80ని పట్టుకోడానికి అందరూ ప్రయత్నిస్తుంటే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో చూపించారు. హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గవు ఆ యాక్షన్ సీన్స్. అయితే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్, కథ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ మధ్యలో ప్రభాస్‌ని కొంచెం కామెడీగా చూపించారు. దీంతో ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ కొడుతుంది.

ఇక బుజ్జి వెహికల్ అయితే ఓ రేంజ్ లో తయారుచేసారు. సెకండ్ హాఫ్ లో వెహికల్ తో అద్భుతాలు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేసారు. మహాభారతం విజువల్స్ అయితే సినిమా మొత్తం మీద ఒక్క 5 నిముషాలు అక్కడక్కడా ఎలివేషన్ షాట్స్ లా చూపిస్తారు. కానీ బెస్ట్ విజువల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మహాభారతాన్ని ఇంత బాగా ఎవరు చూపించలేదని మాత్రం చెప్పొచ్చు. టెక్నికల్ గా ఎంత బాగా చూపించినా ఎమోషన్ ని ఎక్కడా మిస్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో ఆ ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవల్ ఉంటుంది. ఎవరూ ఊహించని ట్విస్ట్ తో పాటు కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసి ఈ సినిమాకు ఇంకో రెండు, మూడు పార్టులు ఉంటాయని హింట్ ఇచ్చారు. సినిమాలో అంతర్లీనంగా ఓ చక్కని మెసేజ్ కూడా ఇచ్చారు. మనుషులు భూమిలోని వనరులు అన్ని లాగేసుకొని ప్రకృతిని నాశనం చేసేస్తున్నారని చక్కని మాటలతో చెప్పారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండగా నాగ్ అశ్విన్ ప్రతి పాత్రకు తగ్గట్టు నటీనటులను పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కామెడీగా నటిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. అయితే మరో పాత్రలో కూడా ప్రభాస్ కనిపించి ట్విస్ట్ ఇచ్చి సూపర్ అనిపిస్తాడు. దీపికా పదుకోన్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో బాగా నటించింది. శోభన కూడా మరియమ్మ పాత్రలో దేవుడు వస్తాడు అని ఎదురుచూస్తూ బతికే ఎమోషన్ లో బాగా చూపించారు. ఇక సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ సరికొత్త గెటప్ లో నెగిటివ్ షేడ్స్ లో కనపడి అదరగొట్టారు. మలయాళ నటి అన్నా బెన్ కైరా పాత్రలో యాక్షన్ అదరగొట్టింది. తమిళ నటుడు పశుపతి, హర్షిత్, మాళవిక నాయర్, దిశా పటాని, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం,దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్.. ఇలా అనేకమంది నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పిస్తారు.

సాంకేతిక విషయాలు..
ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఈ రేంజ్‌లో విజువల్స్ అయితే తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా చూసి ఉండరు. హాలీవుడ్ మార్వెల్స్, డీసీ సినిమాలని మించి కొన్ని సీన్స్ అదిరిపోతాయి. ఇక యాక్షన్స్ పరంగా కూడా కొత్త కొత్త ఆయుధాలతో సరికొత్తగా యాక్షన్ సీక్వెన్స్ 2898 సంవత్సరానికి తగ్గట్టు చూపించారు. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనానికి మెచ్చుకోవాలి. కలియుగాంతంలో భూమి ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా బతుకుతారు అని పర్ఫెక్ట్ గా చూపించారు. ప్రతి సెట్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుంది. కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇక దర్శకుడిగా నాగ్ అశ్విన్ చాలా బాగా కష్టపడి, తన రిసోర్స్ లు అన్ని వాడి పర్ఫెక్ట్ సినిమా తీశాడు అని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా సినిమాకి 500 కోట్ల బడ్జెట్ అని ముందు నుంచి చెప్తున్నారు. ఆ బడ్జెట్ సినిమాలో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ లో బాగున్నా మిగిలిన చోట్ల ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.

మొత్తంగా కలియుగాంతంలో దేవుడు మళ్ళీ పుట్టే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ బిడ్డ పుట్టబోయే మహిళకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎవరు కాపాడారు అనే కథని మహాభారతానికి లింక్ చేసి చాలా అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు 3.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు