Return of the Dragon : ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ రివ్యూ.. లవ్ టుడే హీరో ఇంకో హిట్ కొట్టాడా?

'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఓ స్టూడెంట్ కాలేజీలో ఎలా ఉన్నాడు, లైఫ్ లో ఏమయ్యాడు అని ఆసక్తికర కథనంతో ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు.

Pradeep Ranganathan Anupama Parameswaran Return of the Dragon Movie Review and Rating

Return of the Dragon Movie Review : లవ్ టుడే సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ ఇప్పుడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్స్ గా నటించగా KS రవికుమార్, మిస్కిన్, గౌతమ్ మీనన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. D.రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) ఇంటర్ లో 96 శాతంతో టాప్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించి తనకు ఇష్టమైన అమ్మాయికి వెళ్లి ప్రపోజ్ చేస్తే అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ నచ్చుతారు నీలాగా చదువుకొని, నిదానంగా ఉండే వాళ్ళు కాదు అని చెప్తుంది. దీంతో డ్రాగన్ గా పేరు మార్చుకొని ఇంజనీరింగ్ లో బ్యాడ్ బాయ్ గా మారి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమ నడిపిస్తూ, ఇంజనీరింగ్ లో అన్ని సబ్జక్ట్స్ ఫెయిల్ అయి 48 సప్లీలు పెట్టుకుంటాడు. ఇంజనీరింగ్ అయ్యాక రెండేళ్లు ఇంట్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఖాళీగానే తిరుగుతాడు. ఓ రోజు కీర్తి నీలాంటి వాళ్ళు లవ్ కి మాత్రమే, పెళ్లి కావాలంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది.

దీంతో ఆమె మీద కోపంతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని అడ్డదారిలో ఫేక్ డిగ్రీ తెచ్చుకొని పెద్ద జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ తన ట్యాలెంట్ తో నిజంగానే లైఫ్ లో సక్సెస్ అయి, ఓ పెద్దింటి అమ్మాయి పల్లవి(కయదు లోహర్)తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు, జాబ్ లో అమెరికా ఆఫర్ కూడా వస్తుంది. అన్ని బాగున్నాయి అనుకునే సమయంలో తనని ఎంతో ద్వేషించే కాలేజీ ప్రిన్సిపాల్(మిస్కిన్) తన లైఫ్ లోకి వచ్చి సడెన్ షాక్ ఇస్తాడు. దీంతో ఒక్కసారిగా డ్రాగన్ జీవితం మారిపోతుంది. అనుకోకుండా మరో రూపంలో కీర్తి కూడా మళ్ళీ లైఫ్ లోకి వస్తుంది. హ్యాపీగా సాగిపోతున్న డ్రాగన్ లైఫ్ లోకి ప్రిన్సిపాల్, కీర్తి మళ్ళీ ఎందుకు వచ్చారు? పల్లవితో పెళ్లి జరుగుతుందా? ఇంజనీరింగ్ పూర్తిచేసాడా? ఫేక్ డిగ్రీ పెట్టింది జాబ్ లో తెలుస్తుందా? డ్రాగన్ వల్ల వేరే స్టూడెంట్ కి జరిగిన నష్టం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Emoji : తెలుగులోకి వ‌స్తున్న త‌మిళ రొమాంటిక్ వెబ్ సిరీస్‌.. ఎందులోనో తెలుసా?

సినిమా విశ్లేషణ.. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఓ అబ్బాయి కాలేజీ లైఫ్, ఆ తర్వాత లైఫ్ చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓ రెగ్యులర్ సినిమాలా కాలేజీలో పోకిరిగా ,పొగరుగా తిరిగే హీరో, అతనికి బ్రేకప్ అవ్వడం, అడ్డదారిలో జాబ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ట్యాలెంట్ తో పైకి ఎదగడంతో సింపుల్ గా సాగిపోతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ రొటీన్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ప్రిన్సిపాల్ ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ప్రిన్సిపాల్ ఏం చేసాడు? కీర్తి ఎలా వచ్చింది? డ్రాగన్ ఏం చేసాడు అని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో సినిమా సింపుల్ గా అయిపోయింది అనుకునేలోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చి ఒక మంచి మెసేజ్, మంచి ఎమోషన్ ఇచ్చి ఒక్కసారిగా సినిమాని పైకి లేపారు.

లైఫ్ మారిపోతుంది అనుకుంటే ఒక తప్పు చేయడం తప్పేం కాదు అని మొదట చూపించినా ఆ తప్పు వల్ల ఇంకొకరి జీవితం ఎఫెక్ట్ అవుతుంది చివరకు చక్కగా చూపించారు. కాలేజీలో ఉన్నప్పుడు కుర్రాళ్ళు ఉడుకురక్తంతో ఏదో హడావిడి చేసినా లైఫ్ లో మాత్రం అలా ఉంటే బతకలేం అని బాగా చెప్పారు. లైఫ్ లో ఫెయిల్యూర్, సక్సెస్ వస్తాయి కానీ అవి ఎలా వచ్చాయి అనేది ముఖ్యమని చెప్పారు. తండ్రి ఎమోషన్ కూడా బాగా చూపించారు. కొన్ని సీన్స్ వరకు ఆడియన్స్ విజిల్స్ వేసేలా బాగా రాసుకున్నారు. చాలా చోట్ల కామెడీ సీన్స్ కూడా బాగానే పండాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్.. లవ్ టుడేలో తన హైపర్ యాక్టివ్ నెస్ తో అందర్నీ మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో కూడా అంతే ఎనర్జీతో అదరగొట్టాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఎప్పట్లాగే తన క్యూట్ నెస్ తో, కాస్త ఎమోషన్ తో మెప్పించింది. కయదు లోహర్ తన అందంతో అలరిస్తుంది. ప్రిన్సిపాల్ పాత్రలో మిస్కిన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కంపెనీ హెడ్ గా గౌతమ్ మీనన్ కాసేపు కనిపిస్తారు. తండ్రి పాత్రలో జార్జ్ మర్యన్ ఎమోషన్ పండిస్తారు. కేఎస్ రవికుమార్, హర్షత్, లక్ష్మణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. క్లైమాక్స్ లో లవ్ టుడే హీరోయిన్ ఇవానా గెస్ట్ పాత్రలో మెరిపిస్తుంది.

Also Read : Jaabilamma Neeku Antha Kopama : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ రివ్యూ.. మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. కాలేజీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ లైఫ్ లో ఏమయ్యాడు అనే రెగ్యులర్ పాయింట్ ని కొత్తగా చూపించారు. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు మరోసారి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా AGS ఎంటర్టైన్మెంట్స్ బాగానే ఖర్చుపెట్టింది ఈ సినిమాకు.

మొత్తంగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ఓ స్టూడెంట్ కాలేజీలో ఎలా ఉన్నాడు, లైఫ్ లో ఏమయ్యాడు అని ఆసక్తికర కథనంతో ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.