Jaabilamma Neeku Antha Kopama : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ రివ్యూ.. మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా..

హీరో ధనుష్ తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా.

Jaabilamma Neeku Antha Kopama : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ రివ్యూ.. మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా..

Dhanush Anikha Surendran Jaabilamma Neeku Antha Kopama Movie Review and Rating

Updated On : February 21, 2025 / 7:25 AM IST

Jaabilamma Neeku Antha Kopama Review : తమిళ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు తన మేనల్లుడు పవిష్ నారాయణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తన దర్శకత్వంలో ‘నిలవకు ఎన్ మెల్ ఎన్నాది కోబమ్’ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణంలో కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనేపేరుతో రిలీజ్ చేసారు. ఈ సినిమా నేడు ఫిబ్రవరి 21న రిలీజవుతుండగా నిన్నే ప్రీమియర్లు వేశారు. పవిష్ నారాయణ్ హీరోగా అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్, ఆడుకాలం నరేన్, శరణ్య, శరత్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. ప్రభు(పవిష్ నారాయణ్) ఓ చెఫ్. లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ ఉంటాడు. దీంతో ప్రభు అమ్మ నాన్న(శరణ్య, ఆడుకాలం నరేన్) ప్రభుకి ఒక సంబంధం చూస్తారు. పెళ్లి చూపుల్లో పెళ్లికూతురు(ప్రియా ప్రకాష్ వారియర్) తన స్కూల్ మేట్ కావడంతో ఇద్దరూ మాకు పెళ్లి ఆలోచన ఎప్పుడూ రాలేదు, కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తాం అని చెప్తారు. ఈ ట్రావెలింగ్ లో ప్రభు తన లవ్ స్టోరీ చెప్తాడు.

ప్రభు చదువుకునే రోజుల్లో నిల(అనికా సురేంద్రన్)తో ఎలా పరిచయం అయింది, వారు ఎంతలా ప్రేమించుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళు ఎందుకు విడిపోయారు అని చెప్తాడు. ఇక ప్రభు తన స్కూల్ మేట్ ని పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిన సమయంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిల నుంచి తన వెడ్డింగ్ కార్డు వస్తుంది. దీంతో ప్రభు, అతని ఫ్రెండ్ రాజేష్(మ్యాథ్యు థామస్) కలిసి ఆ పెళ్ళికి వెళతారు. మరి అక్కడ పెళ్ళిలో జరిగిన పరిస్థితులు ఏంటి? ప్రభు – నిల ఎందుకు విడిపోయారు? ప్రభు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? కాంటాక్ట్ లో కూడా లేకుండా వెళ్లిపోయిన నిల పెళ్ళికి ఎందుకు పిలుస్తుంది? ప్రభు ఫ్రెండ్స్ లవ్ స్టోరీలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Ramam Raghavam : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..

సినిమా విశ్లేషణ.. ఇటీవల ఎలాంటి అసభ్యత లేకుండా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు చాలా తక్కువగా వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన మలయాళం డబ్బింగ్ ప్రేమలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఆ స్టోరీ కాకపోయినా అదే వైబ్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభు పెళ్లి చూపులకు వెళ్లడం, ఆ అమ్మాయితో ట్రావెల్, నిలతో తన లవ్ స్టోరీ చెప్పడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్ అంతా నిల పెళ్ళికి గోవాకు వెళ్లి అక్కడ ఏం జరిగింది అని చూపిస్తారు.

సినిమా కొత్త కథేం కాకపోయినా ధనుష్ దాన్ని కొత్తగా మలిచాడు. సినిమా అంతా యూత్ తో సరదాగా నవ్విస్తూ ప్రేమని చూపిస్తూ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా నవ్వించి కాస్త సాగదీశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ గా నవ్వించారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లిలో హీరో ఎలా ఉన్నాడు అని పక్కన ఓ ఫ్రెండ్ ని పెట్టి బాగా నవ్వించారు. సినిమా అంతా సరదాగా సాగిపోతుంది. యూత్ కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీ అంటే ఏదో భారీ ప్రేమ డైలాగ్స్ తో కాకుండా సింపుల్ గా సరదాగా తీశారు.

ప్రభు – నిల లవ్ స్టోరీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ లవ్ స్టోరీలు కూడా నవ్విస్తాయి. అయితే క్లైమాక్స్ లో సినిమా అయిపోయింది అనుకునేలోపు సీక్వెల్ ఇవ్వడం కోసం కాస్త గజిబిజి చేసారు. ఆ సీన్స్ అవసరం లేకపోయినా ఇంకాస్త ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేశారు. మరి సీక్వెల్ తీస్తారా లేదా చూడాలి. ఈ సినిమా చూసాకా ధనుష్ కూడా ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు తీస్తాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. మేనల్లుడిని హీరోగా పరిచయం చేయడానికి ధనుష్ రంగంలోకి దిగి సక్సెస్ అయ్యాడు. ఫ్యాన్స్ ధనుష్ గెస్ట్ అప్పీరెన్స్ ఆశించినా నిరాశే మిగిలింది.

Jaabilamma Neeku Antha Kopama Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. పవిష్ నారాయణ్ మొదటి సినిమాతోనే చక్కగా మెప్పించాడు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసాడు. అనికా సురేంద్రన్ ప్రేమికురాలి పాత్రలో బాగానే మెప్పించిన కొన్ని సీన్స్ లో ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తుంది. మ్యాథ్యు థామస్ హీరో ఫ్రెండ్ పాత్రలో ఫుల్ గా నవ్విస్తాడు. రబియా ఖాటూన్, వెంకటేష్ మీనన్ జోడి కూడా కాస్త నవ్విస్తుంది. రమ్య రంగనాథన్ తెలుగు కుర్రాళ్లకు మరో క్రష్ అవుతుంది. ప్రియా ప్రకాష్ వారియర్ సింపుల్ గా కనిపించి మెప్పిస్తుంది. ఆడుకాలం నరేన్, శరత్ కుమార్, శరణ్య.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. ప్రియాంక మోహన్ ఒక సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెరిపించింది.

Also Read : Baapu : ‘బాపు’ మూవీ ‘రివ్యూ’.. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా.. ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. GV ప్రకాష్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఓ సరదా గ్రాఫిక్స్ సాంగ్ విజువల్ గా మెప్పిస్తుంది. సింపుల్ కథ అయినా మంచి స్క్రీన్ ప్లేతో, సరదా సన్నివేశాలతో బాగా రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ లో డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇక దర్శకుడిగా ధనుష్ మరో హిట్ కొట్టినట్టే. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఒక యూత్ ఫుల్ కామెడీ లవ్ స్టోరీ. ఫ్రెండ్స్ తో కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.