Ramam Raghavam : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..

ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వడంతో సినిమాపై ముందు నుంచి ఆసక్తి నెలకొంది.

Ramam Raghavam : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..

Samuthirakani Dhanraj Ramam Raghavam Movie Review and Rating

Updated On : February 20, 2025 / 7:56 PM IST

Ramam Raghavam Movie Review : సినిమాల్లో కమెడియన్ గా, జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా ఫేమ్ తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘రామం రాఘవం’. ధనరాజ్, సముద్రఖని మెయిన్ లీడ్స్ లో హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ దర్శకత్వంలో రామం రాఘవం సినిమాను నిర్మించారు. ఈ సినిమా రేపు ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే మీడియాకు ప్రీమియర్ షో వేశారు.

కథ విషయానికొస్తే.. దశరథ రామం(సముద్రఖని)కి కొడుకు రాఘవ(ధనరాజ్) పుట్టినప్పట్నుంచి అతనిపై ప్రేమ ఎక్కువ. రామం రిజిస్ట్రార్ ఆఫీస్ లో నిజాయితీ ఆఫీసర్. కానీ రాఘవ చదువు సరిగ్గా చదవక, ఏ పని చేయక బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. రాఘవ డబ్బుల కోసం తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటాడు. చివరికి డబ్బుల కోసం వాళ్ళ నాన్న సంతకం ఫోర్జరీ చేస్తాడు రాఘవ. ఈ సంగతి రామంకి తెలిసి రాఘవని కొట్టి పోలీసులకు అప్పగిస్తాడు.

ఈ కారణంతో పాటు మరో కారణంతో వాళ్ళ నాన్నపై పగ, కోపం పెంచుకుంటాడు రాఘవ. ఆ తర్వాత అతని స్నేహితుడు లారీ డ్రైవర్ దేవా(హరీష్ ఉత్తమన్)తో కలిసి రాఘవ ఏం చేసాడు? తన తండ్రిపై ద్వేషం ఎందుకు? రామం ఏం చేసాడు?  రాఘవ చేసిన తప్పులు ఏంటి? ఈ మధ్యలో రాఘవ లవ్ స్టోరీ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Baapu : ‘బాపు’ మూవీ ‘రివ్యూ’.. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా.. ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ.. ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వడంతో సినిమాపై ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ అంతా బేవర్స్ గా తిరిగే కొడుకు, అతన్ని తిట్టే తండ్రి, కొడుకు చేసే తప్పులతో రెగ్యులర్ సినిమాలా సాగుతుంది. ఈ సీన్స్ అన్ని చాలా సినిమాల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఆసక్తి నెలకొంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూసి రెగ్యులర్ సినిమానే కదా అని అంతా అనుకోవచ్చు అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ అందరూ అనుకున్నట్టు కాకుండా ట్విస్టులు ఇస్తారు. వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తారు. ఒక తండ్రి – కొడుకు ఎమోషన్ కథలో ఇలా ట్విస్టులు పెట్టడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ నుంచి ప్రేక్షకులు కచ్చితంగా ఏడుస్తారు.

ఇన్నాళ్లు నవ్వించిన ధనరాజ్ ఈ సినిమాతో ఏడిపించేస్తాడు. నాన్న ఎమోషన్ మొదట్నుంచి ఏముందిలే అనిపించినా ప్రీ క్లైమాక్స్ నుంచి అదే బాగా వర్కౌట్ అయింది. ఒక మనిషి ఆశ – పేరెంట్స్ ప్రేమ మధ్యలో జరిగే సంఘర్షణగా రామం రాఘవం సినిమాను ధనరాజ్ చక్కగా చూపించడానికి ప్రయతించాడు. ఈ జనరేషన్ ప్రతి కొడుకు చూడాల్సిన సినిమా ఇది. తండ్రి – కొడుకు ఎమోషన్ కథలంటే నాన్నకు ప్రేమతో, యానిమల్ లాంటి సినిమాలే కాదు ఇలాంటి రామం రాఘవం సినిమా కూడా. తండ్రి క్యారెక్టర్ ని – కొడుకు క్యారెక్టర్ ని ఎవరూ ఊహించని విధంగా చాలా బాగా రాసుకున్నారు. సత్యతో అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ధనరాజ్ ఉండగా కొన్ని సీన్స్ లో హరీష్ ఉత్తమన్ కి ఎలివేషన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు, రెగ్యులర్ స్టోరీలా అనిపిస్తుంది. రామం, రాఘవం ఈ రెండు పదాలకు రాముడు అనే అర్ధం. అంటే రెండు పదాలు ఒకటే. రెండూ ఒకే పదాలు అయినా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కథ నడిపించి చివర్లో టైటిల్ కి మంచి డైలాగ్ తో జస్టిఫికేషన్ ఇచ్చారు.

Ramam Raghavam Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు కమెడియన్ గా కనిపించిన ధనరాజ్ ఈ సినిమాలో ఒక సీరియస్ పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చివర్లో కన్నీళ్లు పెట్టించాడు. తండ్రి పాత్రలో సముద్రఖని జీవించేసారు అని చెప్పొచ్చు. తల్లి పాత్రలో ప్రమోదిని కూడా మంచి ఎమోషన్ పండించింది. సత్య అక్కడక్కడా నవ్వించడానికి ప్రయత్నం చేసాడు. హరీష్ ఉత్తమన్ కూడా తన పాత్రలో బాగానే నటించాడు. పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : VishwakSen: లైలా ఫ్లాప్.. ఫ్యాన్స్‌కు విశ్వక్ సేన్ లెటర్.. క్లాస్, మాస్ ఏదైనా సరే ఇకపై..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ సన్నివేశాలకు చాలా బాగా బీజీఎమ్ ఇచ్చారు. పాటలు పర్వాలేదనిపించినా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సాంగ్ మెప్పిస్తుంది. జనాలు రొటీన్ కథ అనుకునేలోపే కొత్తగా ఉంది అనుకునేలా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. డైరెక్టర్ గా ధనరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నటుడిగా, దర్శకుడిగా రెండూ బాగా డీల్ చేయగలిగాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘రామం రాఘవం’ బేవర్స్ గా తిరిగే ఓ కొడుకు తండ్రి పై కోపం, ద్వేషం పెంచుకొని ఏం చేసాడు? ఆ తండ్రి ఏం చేసాడు అని ఎమోషనల్ గా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.