Baapu : ‘బాపు’ మూవీ ‘రివ్యూ’.. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా.. ఎలా ఉందంటే..?
బాపు సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రియల్ లొకేషన్స్ లో తీయడంతో రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది.

Brahmaji Aamani Dhanya Balakrishna Telangana Backdrop Baapu Movie Review and Rating
Baapu Movie Review : సీనియర్ నటుడు బ్రహ్మాజీ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘బాపు’. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై దయాకర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆమని, ధన్య బాలకృష్ణ, సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, గంగవ్వ, మణి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. బాపు సినిమా ఫిబ్రవరి 21న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే పలుమార్లు బాపు సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు.
కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ గ్రామంలో రైతు మల్లయ్య(బ్రహ్మాజీ), అతని భార్య సరోజ(ఆమని) కలిసి వాళ్ళ ఎకరం పొలం సాగు చేసుకుంటారు. పంటలు పండక, పండినవి చేతికి రాక ఊరంతా అప్పులవుతాయి. ఈ సారి పత్తి బాగా పండినా అమ్మే సమయానికి వాన పడి మొత్తం నాశనం అవుతుంది. అప్పులోళ్లు ఓ నెల రోజులు టైం ఇచ్చి ఈ లోపు అప్పులు తీర్చకపోతే పొలం వేలం వేస్తామని బెదిరిస్తారు. దీంతో మల్లయ్యకు ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటే రైతు భీమా వస్తుంది, ఆ డబ్బులు తన కుటుంబం అప్పులు తీర్చి బాగుంటారు అనుకుంటాడు. కానీ తన భార్య నువ్వు చనిపోతే మేమంతా ఏమవ్వాలి అంటూ ఖాళీగా ఇంట్లో ఉండే మల్లయ్య నాన్న(సుధాకర్ రెడ్డి)ని చనిపొమ్మను అంటుంది.
మల్లయ్య తండ్రి మొదట దీనికి ఒప్పుకున్నా అతనికి మతిమరుపు ఉండటంతో ఈ విషయం మర్చిపోతాడు. దీంతో మల్లయ్య, అతని భార్య, అతని కూతురు వరలక్ష్మి(ధన్య బాలకృష్ణ), కొడుకు(మణి) అందరూ కలిసి అతన్ని చంపడానికి రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. మరోవైపు వరలక్ష్మి లవ్ స్టోరీ, మల్లయ్య కొడుకు లవ్ స్టోరీ, ఓ బంగారు విగ్రహం కోసం వెతుకులాట సాగుతాయి.. మరి మల్లయ్య తండ్రి చనిపోయాడా? చంపేసారా? మల్లయ్య కూతురు, కొడుకుల లవ్ స్టోరీలు ఏమయ్యాయి? ఆ బంగారు విగ్రహం కథ ఏంటి.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Manisharma : మెగాస్టార్ పై అభిమానంతో మరోసారి రక్తదానం చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..
సినిమా విశ్లేషణ.. తెలంగాణలో తండ్రిని బాపు అంటారు. అయితే టైటిల్ ఏమో బాపు అని పెట్టి సినిమాలో నాయన అని పిలవడం, బాపు అనే పదం వాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ డైలాగ్స్ కరెక్ట్ గా రాసుకోవాల్సింది అనిపిస్తుంది. ఈ కథ అంతా మల్లయ్య తండ్రి మీదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మల్లయ్య కష్టాలు, అక్కడక్కడా లవ్ స్టోరీలు చూపించి ఇంటర్వెల్ సమయానికి కుటుంబం అంతా కలిసి ఆ ముసలాయన్ని చంపడానికి సిద్ధం అవ్వడంతో అతన్ని ఏం చేస్తారు అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అతన్ని చంపడానికి ప్లాన్స్ వేయడం, ఆ బంగారు విగ్రహం, లవ్ స్టోరీలతో సాగుతుంది.
బాపు సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రియల్ లొకేషన్స్ లో తీయడంతో రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రైతుల కష్టాలు మాత్రం పర్ఫెక్ట్ గా చూపించి ఆ ఎమోషన్ ని పండించారు. కానీ ఒక సీరియస్ సబ్జెక్టులో కామెడీని తీసుకోవడంతో కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కుటుంబం అంతా డబ్బుల కోసం ఒక ముసలివాన్ని చంపడం అనే నెగిటివ్ అంశాన్ని కామెడీతో చూపించడం అస్సలు సెట్ అవ్వలేదు. దానికి తోడు ఇలాంటి సినిమాకు హారర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఆ ఎమోషన్ ని మిస్ చేసారు. లవ్ స్టోరీలు రెండూ ఏమవుతాయి, ఆ బంగారు విగ్రహం ఏమవుతుంది అని మొదట్నుంచే ప్రేక్షకులు ఊహించేయొచ్చు. కామెడీగా సాగదీసిన సీరియస్ పాయింట్ ని చివర్లో సడెన్ గా ఎమోషన్ లోకి మార్చేశారు. బయట నిజంగా రైతులు తమ కష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే రియల్ పాయింట్ ని రియాలిటీగా చెప్పడానికి ట్రై చేసినా కామెడీతో అది విఫలం అయింది. సినిమా అంతా పూర్తిగా తెలంగాణ ఫ్లేవర్ తో ఉంటుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎన్నో పాత్రల్లో ఇప్పటికే అందర్నీ మెప్పించిన బ్రహ్మాజీ ఓ పేద రైతుగా పర్ఫెక్ట్ గా నటించి మెప్పించాడు. ఆమని భార్య పాత్రలో ఉండే ఎమోషన్, కోడలిగా ఉండే అసూయ రెండూ బాగానే చూపించింది. ధన్య బాలకృష్ణకు చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్ర పడింది. ముసలాయన సుధాకర్ రెడ్డి సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు. సినిమా అంతా బాగానే నవ్వించాడు. రచ్చ రవి, గంగవ్వ, మణి, అవసరాల శ్రీనివాస్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Allu Arjun – Dhanaraj : అల్లు అర్జున్ గారిని ఆ రోజు కాల్ చేయమని చెప్పాను.. గుర్తుంచుకొని మరీ కాల్ చేసి..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో సినిమా తీయడం చాలా ప్లస్ అయి తెలంగాణ గ్రామీణ ఫ్లేవర్ కనపడింది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్. ఆ కథకు హారర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు ఇచ్చారో దర్శకుడు, సంగీత దర్శకుడికే తెలియాలి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కథగా ఒక మంచి పాయింట్ ని తీసుకున్నా దాన్ని మొదట్లో నెగిటివ్ గా, తర్వాత కామెడీగా చెప్పడంతో ఎమోషన్ మిస్ అయింది. డైరెక్టర్ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చు పెట్టారు.
మొత్తంగా ‘బాపు’ సినిమా తమ కష్టాలు తీర్చడానికి ఇంట్లో వాళ్లంతా కలిసి ఇంట్లోని ముసలాయన్ని చంపేద్దాం అనుకుంటే ఏం జరిగింది అని కామెడీగా ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.