మరోసారి తల్లి అయిన హీరోయిన్ స్నేహా

  • Publish Date - January 25, 2020 / 02:27 AM IST

వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు, ఏమండోయ్ శ్రీవారు అంటూ పలు సినిమాలతో తెలుగు తెరపై ఆకట్టుకున్న చెన్నై బ్యూటీ స్నేహా.. రెండవసారి తల్లి అయ్యారు. శుక్రవారం(24 జనవరి 2020) ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రముఖ తమిళ నటుడు ప్రసన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగింది.

‘అచ్చముండు అచ్చముండు’ చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవలికాలంలో ఆమె సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విదేయ రామ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. 

బాబు పుట్టిన తర్వాత సినిమాల గ్యాప్‌ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె చివరిగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని స్నేహ భర్త, నటుడు ప్రసన్న తెలిపగా.. స్నేహ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఇంతకు ముందు స్నేహ దంపతులకు విహాన్‌ అనే అబ్బాయి ఉన్నాడు.