ఇండియాలోనే ఫస్ట్‌టైమ్.. పృథ్వీరాజ్ డేరింగ్ అటెంప్ట్..

మారుతున్న కాలంతోపాటు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా చిత్రపరిశ్రమ ఎప్పటికప్పుడు సాంకేతికంగా అప్‌డేట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. నాటి బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటివరకు ఫిల్మ్ మేకింగ్ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇండియాలో తొలిసారిగా!..
ఇప్పటివరకు గ్రాఫిక్స్, త్రీ డి, లైవ్ యాక్షన్ టెక్నాలజీ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. పాపులర్ మలయాళ హీరో, నిర్మాత, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు.
ఈ పద్ధతిలో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
పాన్ ఇండియా స్థాయిలో..
‘‘చలనచిత్ర నిర్మాణంలో వినూత్న పద్ధతులు వస్తున్నాయి. అలాగే, సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కాలం మారుతోంది. చిత్రనిర్మాణ కళ, విజ్ఞానశాస్త్రంలో నాకు ఇదొక ఉత్సాహపూరిత అధ్యాయం’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ అంటున్నారు. పూర్తిగా వర్చువల్ ప్రొడక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. అందులో హీరోగా నటించడంతో పాటు ఆయనే నిర్మించనున్నారు. గోకుల్‌రాజ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
అసలు ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్?..
హాలీవుడ్‌లో ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘రెడ్ ప్లేయర్ వన్’ చిత్రాలు వర్చువల్ ఫిల్మ్ మేకింగ్ పద్ధతిలో తెరకెక్కాయి.
ఒరిజినల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్(CG) ద్వారా అక్కడే (ఒరిజినల్ లొకేషన్‌లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందనేది ఎవ్వరికీ పక్కాగా తెలియదు.
ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాను అదే తరహాలో తెరకెక్కించనున్నారు. ఒక పోస్టర్ విడుదల చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ‘‘భారత దేశంలో పూర్తిగా వర్చువల్ ప్రొడక్షన్‌లో చిత్రీకరించనున్న తొలి చిత్రమిది. గొప్ప కథను చెప్పబోతున్నాం’’ అని తెలిపారు.