Chiranjeevi
Chiranjeevi: ఫిల్మ్ ఛాంబర్‌తో నిర్మాతల చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు.
త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని సి.కల్యాణ్ చెప్పారు. నిర్మాతలం అందరమూ కలిసి ఛాంబర్ కి బాధ్యత అప్పగించామని తెలిపారు.
ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. చాలా ఫాస్ట్ గా పరిష్కారం జరుగుతుందని అన్నారు.
మరోవైపు, సినీనటుడు చిరంజీవి(Chiranjeevi)తో ఫిలిం ఫెడరేషన్ సమావేశమైంది. ప్రతి యూనియన్ తో విడివిడిగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు చిరంజీవి. రేపు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ తో ఫిలిం ఛాంబర్ సమావేశం జరుగుతుంది.
టాలీవుడ్‌లో సినీ కార్మికుల ఆందోళనతో సినిమాల చిత్రీకరణలు రెండు వారాలుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జీతాలు పెంచాల్సిందేనని కార్మికులు అంటున్నారు. చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వడం లేదు.
ఈ వివాదంపై చిరంజీవి జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాలతో పాటు నిర్మాతలు ఆయనను సంప్రదిస్తున్నారు.
నిర్మాత సి.కల్యాణ్‌తో కూడా చిరంజీవి ఇప్పటికే సమావేశం అయ్యారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. “గత 15 రోజులగా మా కార్మిక వేతనాల పెంపుకోసం మేము సమ్మె చేస్తున్నాం.
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారు. ఏదేమైనా మా వర్కర్స్ బాగుండాలి.. అలాగే నిర్మాతలు కూడా బాగుండాలి.
మేము 2 కండీషన్స్ కి ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవికి వివరించాం. ఆదివారం డబుల్ కాల్ షీట్ గురించి కూడా మెగాస్టార్ కి విన్నవించుకున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రండని చిరంజీవి చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్ నుంచి కూడా మాకు పిలుపు వచ్చింది.
రేపు ఛాంబర్ తో కూడా సమావేశం కానున్నాం. మేం అడిగినట్లుగానే మాకు వేతనాలు వస్తాయని మేం భావిస్తున్నాం. చిరంజీవి మాట్లాడినా, బాలయ్య బాబు మాట్లాడినా మా సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడతారు.. కానీ, ఎవరి వైపూ మొగ్గు చూపి మాట్లాడరు” అని అన్నారు.