పాపులర్ బాలీవుడ్ సీరియల్ నటి పూజా బెనర్జీ, కునాల్ వర్మ వివాహబంధంతో ఒక్కటయ్యారు..
‘Devon Ke Dev Mahadev’(హరహర మహాదేవ శంభో శంకర) సీరియల్ ఫేం పూజా బెనర్జీ తన లాంగ్ టైమ్ ఫ్రెండ్, నటుడు కునాల్ వర్మను వివాహం చేసుకుంది. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో తాము నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందామె. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి చేసుకోవడం ఎలా వీలుపడిందబ్బా.. అనే సందేహం అందరికీ వస్తుంది.
వాస్తవానికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గత నెలలోనే కోర్టు మ్యారేజీ ద్వారా తమ పెళ్లిని అఫీషియల్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. కట్ చేస్తే ఈలోగా కరోనా మహమ్మారి విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో పూజా, కునాల్ నిరాశకు గురయ్యారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వివాహ వేడుకలను రద్దు చేసుకున్న ఈ జంట.. వాటి కోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని సోషల్ సర్వీస్‌కు వెచ్చించనున్నట్లు తెలియచేశారు.
Read Also : విరాళమిచ్చినా విమర్శలు తప్పడం లేదు .. అంత సంపాదించి ఇంతేనా ఇచ్చేది?..
పూజా గతేడాది దుర్గా పూజలో సింధు ఖేల్‌కు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఈరోజు మా పెళ్లి వేడుక జరగాల్సింది. అయితే దానిని మేం రద్దు చేసుకున్నాం. అధికారికంగా మేము ఇప్పుడు భార్యభర్తలం. మా తల్లిదండ్రులు, తాతా- బామ్మల ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది తమ ప్రియమైన వాళ్లను కోల్పోవడం హృదయాలను కలచివేస్తోంది. వారి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా మా వంతు సాయంగా పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నాం. మళ్లీ ఈ ప్రపంచం త్వరలోనే పూర్వస్థితికి రావాలని ఆశిస్తున్నాం. జై మాతాది’’అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నూతన వధూవరులకు పలువురు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పెళ్లి కోసం వెచ్చించాలనుకున్న డబ్బును సమాజసేవకు ఉపయోగించాలనుకోవడం మంచి ఆలోచన అంటూ నెటిజన్లు పూజా, కునాల్ జంటను అభినందిస్తున్నారు.