బిడ్డకు జన్మనిస్తేనే అమ్మా..?: ఆసక్తిగా జయలలిత బయోపిక్ ట్రైలర్

  • Publish Date - December 7, 2019 / 02:44 AM IST

అలనాటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురట్చి తలైవి అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’. ఈ వెబ్ సిరీస్‌‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. చిన్నప్పటి జయలలిత షాట్… అలాగే అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తూ తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించి ఉండడం ఆసక్తికరంగా మారింది.

2.44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో జయలలిత చిన్నతనం, కథానాయికగా మారడం, ఎంజీఆర్‌తో రాజకీయాలు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయడం.. వంటి సన్నివేశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎంజీఆర్‌ అంతిమ ఊరేగింపు సమయంలో జయలలితను కిందకు తోసేయడం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఇందులో చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది.

‘కుళందై పెట్రాల్‌దాన్‌ అమ్మావా’.. (బిడ్డకు జన్మనిస్తేనే అమ్మా..?) అనే మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జయలలిత అనే పేరు పెడితే సమస్య వస్తుందనే కారణంతో జయ పేరుకు బదులుగా శక్తిగా మార్చినట్లు తెలుస్తుంది. ఎంజీఆర్‌ పాత్రను జీఎంఆర్‌గా మార్చారు. పాఠశాల విద్యార్థిని పాత్రలో అనికా, కథానాయిక పాత్రలో అంజనా జయప్రకాశ్‌, రాజకీయ నేత క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపిస్తున్నారు. ఎంజీఆర్‌ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్‌ నటించారు.

ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ గతంలో ‘కిడారి’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక మరోవైపు కంగనా రనౌత్‌ జయలలితగా నటిస్తుండగా.. తలైవి అనే సినిమా తెరకెక్కతుంది. ఈ సినిమాకి విజయ్ దర్శకుడు.