రజనీ కొత్త పార్టీ.. మక్కల్ సేవై కట్చి.. సింబల్‌గా ఆటో రిక్షా!

  • Publish Date - December 15, 2020 / 09:33 AM IST

Rajinikanth Party .. Makkal Sevai Katchi : సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ పేరు, సింబల్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా అంతా సిద్ధం చేసుకుంటున్న రజనీ… కొత్తగా పార్టీ స్థాపించే బదులుగా… ఇప్పటికే రిజిస్టర్‌ అయిన పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన బాషా సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్‌నే పొలిటికల్ కెరీర్ గా కూడా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికే రిజిస్టర్ అయిన మక్కల్ సేవై కట్చి అనే పార్టీ పేరుతో రాజకీయ రణక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ కోసం రెండున్నర నెలల క్రితమే ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది.

రాజకీయ కెరీర్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేసిన రజనీ… ముందుగా కొత్తగా పార్టీ స్థాపించి దాని ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం మక్కల్ శక్తి కట్చి అనే పేరును కూడా ఇప్పటికే ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పుటు మక్కల్ సేవై కట్చి పార్టీ పేరుతో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మక్కల్ సేవై కట్చి అంటే సేవే మార్గం అని అర్థం. ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లోకి వస్తున్నట్లు తొలి నుంచి రజనీ చెబుతున్న మాట. అటు పార్టీ సింబల్ కూడా అనుకూలంగా ఉండటంతో… మక్కల్ సేవై కట్చి పార్టీ ద్వారా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది