నాకు పర్మిషన్ లేదు: ‘మా’ వివాదం.. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై రామ్‌చరణ్ కామెంట్

  • Publish Date - January 7, 2020 / 04:46 AM IST

దేశవ్యాప్తంగా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. 2020 జులై 30న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించినా కూడా అనేక అనుమానాలు రిలీజ్‌పై వ్యక్తమయ్యాయి. అయితే లేటెస్ట్‌గా దీనిపై క్లారిటీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈ సినిమా సమ్మర్‌లోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు. అంతకు మించి సినిమా గురించి చెప్పడానికి నాకు పర్మిషన్ లేదని అన్నారు. ఓ మొబైల్ షో రూమ్ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన రామ్ చరణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారిలో ఒకరు ఆర్‌ఆర్‌ఆర్ విడుదల ఎప్పుడు ఉంటుంది అని అడుగగా.. ఖచ్చితంగా సమ్మర్ కానుకగా విడుదల చేస్తాం అని చెప్పారు. సమ్మర్ అంటే ముందుగా చెప్పిన విధంగా జులై 30న వస్తుందని క్లారిటీ ఇచ్చినట్లే.

ఇక సినిమా 70శాతం వరకు పూర్తయినట్లుగా రామ్ చరణ్ చెప్పారు. తెలుగు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు కాల్పనికత జోడించి రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు.

అలాగే ఇటీవల ‘మా’ అసోసియేషన్ వివాదంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన రామ్ చరణ్.. ‘మా’లో సమస్యలను పరిష్కరించడానికి అందులో పెద్దలు ఉన్నారని వారు చూసుకుంటారని, ‘మా’ అనేది చాలా మంచి అసోసియేషన్ అని అన్నారు. మా షూటింగ్‌లు మేం చేసుకుంటూ మేం హ్యాపీగా ఉన్నాం అని అన్నారు.