అల్లూరికి కొమరం భీం బర్త్‌డే సర్‌ప్రైజ్..

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..

  • Publish Date - March 26, 2020 / 04:05 PM IST

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రేపు (మార్చి 27) తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్ చేయడంతో అధికారిక వేడుకలను రద్దు చేసుకున్న చరణ్, ఇంట్లోనే తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజు పండుగ జరుపుకోనున్నారు.

ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకు ‘రౌద్రం రణం రుధిరం’లో కొమరం భీంగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్‌ని రేపు (మార్చి 27) ఉదయం 10 గంటలకు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో తన మిత్రుడు చరణ్ పుట్టిన రోజుని ఎంతో ఘనంగా జరిపే అవకాశం లేనప్పటికీ, రేపు తాను ఇచ్చే బర్త్ డే సర్‌ప్రైజ్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికీ మరిచిపోలేరని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నిన్న నేను ట్విట్టర్‌లో జాయిన్ అయి ఉండకపోతే, రేపు నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్‌ని మిస్ అయి ఉండేవాడిని అంటూ ఎన్టీఆర్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ చరణ్ ఒక పోస్ట్ చేశారు. అయితే అల్లూరికి కొమరం భీం ఇచ్చే ఆ సర్‌ప్రైజ్‌ ఏమై ఉంటుందా అని అప్పుడే మెగా, నందమూరి ఫ్యాన్స్ పలు ఆలోచనలతో సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.