Andhra King Taluka Review : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ.. ఫేవరేట్ హీరో కోసం అభిమాని ఏం చేసాడు..?

ఫ్యాన్స్ కాదు ఇప్పుడున్న హీరోలు అంతా చూడాల్సిన సినిమా ఇది. (Andhra King Taluka Review)

Andhra King Taluka Review : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ.. ఫేవరేట్ హీరో కోసం అభిమాని ఏం చేసాడు..?

Andhra King Taluka Review

Updated On : November 27, 2025 / 12:54 PM IST

Andhra King Taluka Review : రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కిన సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేశ్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నేడు నవంబర్ 27న థియేటర్లలో రిలీజయింది.(Andhra King Taluka Review)

కథ విషయానికొస్తే.. ఈ కథ 2000 ప్రాంతంలో జరుగుతుంది. స్టార్ హీరో ఆంధ్ర కింగ్ సూర్య(ఉపేంద్ర) అప్పటికే వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ ఇవ్వడం, అప్పుల్లో మునిగిపోవడం, తన సినిమాని కొనడానికి ఎవరూ రాకపోవడంతో సూర్య 100వ సినిమా నిర్మాత దగ్గర డబ్బులు లేవని, ఇంకా మూడు కోట్లు కావాలని మధ్యలోనే ఆగిపోతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తమ బాకీలు చెల్లించాలంటూ హీరో సూర్య ఇంటిపై దాడి చేస్తారు. తన కెరీర్ అయిపొయింది అనుకునే సమయంలో సూర్య ఎకౌంట్లోకి మూడు కోట్లు పడతాయి. దీంతో ఆ డబ్బు ఎవరు వేశారు అని తెలుసుకునే క్రమంలో గోదావరి జిల్లాలోని గోడపల్లి లంక అనే ఓ చిన్న గ్రామంలో ఉండే తన అభిమాని సాగర్(రామ్) వేశాడని తెలుస్తుంది. దీంతో అసలు ఈ సాగర్ ఎవరు? సాగర్ తనకి ఎందుకు డబ్బులు వేశాడు? ఈ సాగర్ కథ ఏంటి తెలుసుకోవడానికి సూర్య బయలుదేరుతాడు.

మరోవైపు సాగర్ కు చిన్నప్పుడే ఓ సంఘటనతో హీరో సూర్యతో అనుబంధం ఏర్పడుతుంది. అది పెరుగుతూ పిచ్చి అభిమానంగా మారుతుంది. సాగర్ ఓ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మి(భాగ్యశ్రీ భోర్సే) ప్రేమలో పడతారు. సాగర్ తన ప్రేమ కోసం, తన అభిమాన హీరో సూర్య కోసం, తన ఊరి కోసం ఏం చేసాడు? ఏమి లేని సూర్య అసలు మూడు కోట్లు ఎలా సంపాదించాడు.. ఇవన్నీ తెలియలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Keerthy Suresh : చిరంజీవిని నేను అవమానించలేదు.. మెగా ఫ్యాన్స్ కి కీర్తి సురేష్ క్షమాపణ.. అయినా ఆ హీరో డ్యాన్సే గొప్పంట..

సినిమా విశ్లేషణ..

రామ్ గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో మొదట ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా ఇది సినిమాలకు, ఫ్యాన్స్ కి సంబంధించిన సినిమా అని తెలియడంతో, సాంగ్స్ బాగుండటంతో ఆంద్ర కింగ్ తాలూకా సినిమాపై హైప్ వచ్చింది. కథ చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ లోనే జరుగుతుంది. ఓపెనింగ్ సీన్ తోనే స్టార్ హీరోలకు ఫ్లాప్స్ పడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఇండస్ట్రీలోని రియాలిటీ చూపించారు. హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ బాగుంటాయి.

ఓ పక్క సాగర్ తన అభిమాన హీరో కోసం సినిమాలు చూడటం, థియేటర్స్ దగ్గర హడావిడి చేయడం, అందరి ఫ్యాన్స్ లాగే వేరే హీరోల అభిమానులతో గొడవలు పడటం చేస్తూనే మరోపక్క హీరోయిన్ తో ప్రేమ సాగుతుంది. తన ప్రేమని నిలబెట్టుకోడానికి హీరో ఓ ఛాలెంజ్ చేస్తాడు. అలాంటి సమయంలోనే తన హీరో 100వ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. దీంతో సాగర్ ఏం చేస్తాడు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా సాగర్ డబ్బులు సంపాదించడం కోసం ఏం చేసాడు అని రాసుకున్న సీన్స్ అన్ని చాలా సినిమాల్లో లాగే హీరో ఏదో ఒక ఆలోచనతో ఎదిగిపోవడం, విలన్లు అడ్డు పడటం.. లాంటి సీన్స్ తో ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఇలాగే సాగిపోతుంది. క్లైమాక్స్ మాత్రం కొత్తగా రాసుకున్నారు. క్లైమాక్స్ అభిమాని కోసం హీరో రావడం అనే ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది.

ఫస్ట్ హాఫ్ లో సాగర్ చిన్నప్పటి పాత్ర సీన్స్ బాగా ల్యాగ్ ఉంటాయి. అందులో కొన్ని సీన్స్ కట్ చేసినా పర్వాలేదనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో కూడా వరదలు సీన్స్ మరీ కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి. ఆ వరదల సీన్స్ లేకపోయినా క్లైమాక్స్ బాగానే రాసుకోవచ్చు కానీ అభిమానుల పరిస్థితి ఇలా ఉన్నా హీరోల కోసం నిలబడతారు అని చెప్పడానికి దర్శకుడు ఆ సీన్స్ రాసారేమో అనిపిస్తుంది.

ఫ్యాన్స్ వార్స్, అభిమానులు హీరోల కోసం చేసే పనులు, హీరో సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు పడే బాధలు.. ఇవన్నీ నేనింతే, ఒక విచిత్రం.. లాంటి పలు సినిమాల రిఫరెన్స్ లు అక్కడక్కడా కనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా అయితే కొత్త పాయింట్ తీసుకొని ఒక అభిమాని తన ఫేవరేట్ హీరో కోసం ఏం చేసాడు అని కొత్తగా చూపించారు. అందరి హీరోల ఫ్యాన్స్ కి, గోదావరి జనాలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వొచ్చు. ఫ్యాన్స్ కాదు ఇప్పుడున్న హీరోలు అంతా చూడాల్సిన సినిమా ఇది. వాళ్లకు ఫ్యాన్స్ విలువ ఏంటో చెప్పే సినిమా. అలాగే ఫ్యాన్స్ హీరోల నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.

Ram Pothineni Upendra Bhagyashri Borse Andhra King Taluka Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్..

రామ్ పోతినేని లవర్ బాయ్ గా మంచి లవ్ స్టోరీలో కనిపించి చాలా కాలం అయింది. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీతో మళ్ళీ తనలోని చాక్లెట్ బాయ్ ని చూపించాడు. మరోవైపు తమ ఫేవరేట్ హీరోల కోసం అభిమానులు పడే తపన ఎలా ఉంటుంది అనే పాత్రలో చాలా బాగా నటించాడు. భాగ్యశ్రీ భోర్సే సింపుల్ లుక్స్ తో లవ్ స్టోరీలో అందంగా కనిపిస్తూ చక్కగా నటించింది.

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరో పాత్రలో బాగా నటించారు. రాహుల్ రామకృష్ణ, సత్య అక్కడక్కడా నవ్వించారు. మురళీ శర్మ నెగిటివ్ పాత్రలో మెప్పించారు. రావు రమేష్ హీరో తండ్రి పాత్రలో మెప్పిస్తారు. తులసి, రాజీవ్ కనకాల, శివారెడ్డి, విటివి గణేష్.. పలువురు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. ఒకప్పటి హీరోయిన్ సింధు తులాని చిన్నపాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది.

Also Read : Keerthy Suresh : 8 గంటల పనిపై కీర్తి సురేష్ కామెంట్స్.. నేను ఎలా అయినా పనిచేస్తా.. కానీ నిద్ర ఇంపార్టెంట్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా బాగున్నాయి. థియేటర్, లంక గ్రామం.. ఈ లొకేషన్స్ అన్ని బాగా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా థియేటర్ సెటప్, సెట్స్ కి బాగానే కష్టపడింది. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ మొదటి తెలుగు సినిమా అయినా చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఇచ్చారు. బిట్ సాంగ్స్ తో కలిపి ఏడు పాటలు ఉండటం గమనార్హం. అన్ని పాటలు వినడానికి బాగున్నాయి.

ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫ్యాన్స్, హీరోల గురించి వచ్చే డైలాగ్స్ మెప్పిస్తాయి. హీరో – అభిమాని మధ్యలో కొత్త పాయింట్ తీసుకొని దానికి ఒక క్యూట్ లవ్ స్టోరీ జత చేసి చక్కగా రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో, క్లైమాక్స్ లో కొంత కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తను అభిమానించే హీరో కోసం ఓ అభిమాని ఏం చేసాడు అని చూపించే సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.