RAM : మొన్న హనుమాన్.. ఇప్పుడు ‘రామ్’.. ప్రతి సినిమా టికెట్ నుంచి 5 రూపాయలు..
దేశభక్తిని చాటే విధంగా ఉండే ఈ రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది.

RAM Rapid Action Mission Movie Team gives fund to Defence Fund from each ticket five rupees
RAM – Rapid Action Mission : సూర్య అయ్యలసోమయాజుల, ధన్య బాలకృష్ణ(Dhanya Balakrishna) జంటగా కొత్త దర్శకుడు మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యానర్స్ పై దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామ్’ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేశారు. దేశభక్తిని చాటే విధంగా ఉండే ఈ రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా చిత్రయూనిట్ తో పాటు నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్, నటుడు సాయి కుమార్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్ లో నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. డైరెక్టర్ చెప్పిన బడ్జెట్లో సినిమా తీసాడు. ఈ సినిమాకు అమ్ముడయిన ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాము. దేశ సైనికులకు ఈ రామ్ సినిమాను అంకితం చేస్తున్నాము అని తెలిపారు. ఇటీవల హనుమాన్ సినిమా ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ కూడా ఇదే ఆలోచనతో డిఫెన్స్ ఫండ్ కి ఇస్తుండటంతో పలువురు అభినందిస్తున్నారు.
ఇక ఈ ఈవెంట్లో హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ.. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు మాకు. ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది. అందుకే సినిమా తీశాం. నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫండింగ్ చేసి ఈ సినిమాని తీశారు. మొన్న సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు మా సినిమా కూడా అంతే. వందలో అరవై మందికి మా సినిమా నచ్చుతుంది. సినిమా బాగుంటే బాగుందని లేకపోతే బాగోలేదని చెప్పండి అని అన్నారు.
నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత దేశ భక్తి సినిమాలో హీరో సూర్య, డైరెక్టర్ మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి కష్టపడి సినిమా తీశారు. సినిమాలో ఫైట్స్, డైలాగ్స్ అన్ని బాగుంటాయి. కంటెంట్ బాగుండి ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు అని అన్నారు.
దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ.. ఇది దేశ భక్తిని చాటే సినిమానే కానీ బోర్డర్‌లో ఉండే సైనికుల గురించి కాదు. దేశం లోపల టెర్రర్ అటాక్ నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను. మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు మా డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు అని అన్నారు.