Dhurandhar The Revenge : ‘దురంధర్ 2’ మూవీ రివ్యూ.. ది రివెంజ్.. ఫస్ట్ పార్ట్‌కి మించి.. క్లైమాక్స్ మైండ్ బ్లాక్..
ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఇండియా అంతటా ఈ సినిమాకు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.(Dhurandhar The Revenge)
- Saketh U
- Published On : March 18, 2026 / 11:55 PM IST
Dhurandhar The Revenge
Dhurandhar The Revenge : రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన దురంధర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్స్ పై ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ మార్చ్ 19న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.(Dhurandhar 2 Review)
కథ విషయానికొస్తే..
ఫస్ట్ పార్ట్ లో జస్కిరత్ సింగ్.. హంజా అలీ మజారి(రణవీర్ సింగ్) అనే పేరుతో ఇండియన్ ఏజెంట్ గా పాకిస్థాన్ వచ్చి మెల్లిమెల్లిగా ఎదిగి అక్కడ లైరిలో బలూచీల లీడర్ రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా) పక్కన చేరి అతన్నే చంపేస్తాడు. అక్కడ్నుంచి సెకండ్ పార్ట్. అయితే ధురంధర్ రివెంజ్ అసలు జస్కిరత్ సింగ్ హంజా అలీ మజారి గా ఎలా మారాడు అని చూపించి ఆ తర్వాత పాకిస్థాన్ లో కథని మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో ఈ కథ మొదలవుతుంది. జస్కిరాత్ సింగ్(రణవీర్) పంజాబ్ లోని ఓ ఆర్మీ ఫ్యామిలీకి చెందినవాడు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే, అతని మనుషులు ఓ ల్యాండ్ కోసం తన తండ్రిని చంపేసి, చెల్లిని రేప్ చేసి ఎత్తుకెళ్తారు. దీంతో జస్కిరాత్ సింగ్ ఎమ్మెల్యేని, అతని మనుషులందరినీ చంపేసి జైలుకి వెళ్తాడు. రెండేళ్ల తర్వాత ఆల్రెడీ ఆపరేషన్ ధురంధర్ చేద్దామని ప్లాన్ లో ఉన్న అజయ్ సన్యాల్(మాధవన్) జస్కిరాత్ సింగ్ ని తెప్పించి ట్రైనింగ్ ఇచ్చి హంజా అలీ మజారిగా మార్చి ఆఫ్గనిస్తాన్ ద్వారా పాకిస్థాన్ లోకి పంపిస్తాడు.
రెహమాన్ డెకాయిట్ చనిపోయాక అతని బామ్మర్ది ఉజైర్(దానిష్ పండోర్)ని లీడర్ చేసి అన్ని తానే నడిపిస్తాడు హంజా. లైరిలో ఉన్న ISI వాళ్ళని, వేరే తప్పుడు పనులు చేసే వాళ్ళను, ఇండియాకు అక్రమ ఆయుధాలు, ఫేక్ కరెన్సీ నడిపేవాళ్లను చంపుతూ, ఇండియాకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ, ఉజైర్ ని మెల్లిగా జైలుకి పంపించి కరాచీకి, బలూచీలకు లీడర్ గా ఎదుగుతాడు హంజా. ISI లీడర్ ఇక్బాల్ ISI హెడ్ బడే సాబ్ దగ్గరికి హంజాని తీసుకెళ్తాడు. అక్కడో డ్రగ్స్ డీలింగ్ జరుగుతుంది. ఆ డ్రగ్స్ ని ఇండియాకు తీసుకెళ్లడానికి తన ఊరి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి హంజా షాక్ అవుతాడు. ఆ వ్యక్తి హంజాని గుర్తుపడతాడా? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు బడే సాబ్ ఎవరు? హంజా ఇండియన్ ఏజెంట్ అని ఎవరెవరికి తెలుస్తుంది? పాకిస్తాన్ లో తను చంపాల్సిన వాళ్ళందర్నీ హంజా చంపేశాడా? మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
ఇండియాలో జరిగే టెర్రరిస్ట్ అటాక్స్, వాటికి పాకిస్తాన్ తో ఉన్న లింక్ లు చూపిస్తూ ఓ ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ వాళ్లలో కలిసిపోయి ఎలా ఎదిగాడు అని యాక్షన్, లవ్, దేశభక్తి కథాంశంతో తెరకెక్కించిన ధురంధర్ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమా దాదాపు 1300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఇండియా అంతటా ఈ సినిమాకు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.
అసలు జస్కిరత్ సింగ్ హంజాగా ఎలా మారాడు అని సినిమా మొదలవుతుంది. ఆ ఎపిసోడ్ అంతా బాగుంటుంది. ఇక లైరిలో హంజా ఎదగడం కాస్త రియాలిటీకి దూరంగా సినిమా కాబట్టి సినిమాటిక్ గా చూపించేసారు. అక్కడ కొన్ని సీన్స్ సాగదీశారు. ఫస్ట్ పార్ట్ కొంత సాగదీశారు. బడే సాబ్ ఎవరు అనే ట్విస్ట్ హైలెట్. అది థియేటర్లో చూడాల్సిందే. బడేసాబ్ ని హంజా కలిసే సీన్ కూడా హైలెట్. ఇంటర్వెల్ కి డ్రగ్స్ డీలింగ్ కోసం వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అవ్వడం ఖాయం. ఆ వ్యక్తితో హంజాకి జరిగే సీన్ తో ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో హంజా ఇండియన్ ఏజెంట్ అని కొంతమందికి డౌట్ రావడం, వాళ్ళేం చేశారు? హంజా ఏం చేసాడు అనేది ప్రతి సీన్ ఉత్కంఠగా హెవీ యాక్షన్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా పరిగెడుతుంది కథ. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అసలు ఊహించలేం. ఆ ట్విస్ట్ లకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
పాకిస్తాన్ మనపై చేసిన అటాక్స్, ఆ అటాక్స్ ఎవరెవరు చేసారో వాళ్ళని చూపించడం, మోడీ పీఎం అవ్వడం, పెద్ద నోట్ల రద్దు చేయడం, దాని వెనక ఉన్న కారణాలు, ఇండియాలో ఉండి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం.. లాంటి రియల్ గా జరిగిన సంఘటనలు అన్ని చూపించారు. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. క్లాప్స్, విజిల్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక సారా – రణవీర్ మధ్య లవ్ ఎమోషన్, దేశభక్తి ఎమోషన్ కూడా బాగా పండింది. హీరో ఎలివేషన్స్ కి కొదవలేదు. అక్కడక్కడా నవ్వుకోవచ్చు కూడా. ఇండియన్స్ అంతా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఆల్రెడీ గతంలో ఉరి సినిమాతో దర్శకుడిగా మెప్పించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమా తర్వాత ఇండియాలో బెస్ట్ దర్శకులలో ఒకరు అని గట్టిగా చెప్పొచ్చు. ఈ సినిమాకు కలెక్షన్స్ తో పాటు అవార్డులు కూడా రావడం ఖాయం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే అందరూ తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పించారు. ఇందులో అంతకు మించి. హంజా అలీ మజారి/జస్కిరాత్ సింగ్ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేసాడు. యాక్షన్ సీన్స్ కోసం చాలానే కష్టపడి బాగానే దెబ్బలు కూడా తగిలించుకున్నాడు అని తెలుస్తుంది. రణవీర్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సారా అర్జున్ ఫస్ట్ పార్ట్ లో లవ్ యాంగిల్ చూపిస్తే ఇందులో ఎమోషనల్ పాత్రలో బాగానే నటించింది. SP చౌదరి అస్లాంగా సంజయ్ దత్ మెప్పిస్తారు. ఇక అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ జీవించేశారని చెప్పాలి. చాలా బాగా నటించారు.
ISI లీడర్ పాత్రలో విలన్ గా అర్జున్ రాంపాల్ ఫస్ట్ పార్ట్ లో కొంతే కనిపించినా సెకండ్ పార్ట్ లో మాత్రం మెయిన్ విలన్ గా మారి అదరగొట్టేసాడు తన పర్ఫార్మెన్స్ తో. ఉజైర్ పాత్రలో దానిష్ పండోర్ బాగా నటించారు. రాకేష్ బేడీ, అశ్విన్ ధర్, గౌరవ్ గెరా, మనవ్ గోహిల్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్, ఈ సినిమా డైరెక్టర్ భార్య యామి గౌతమ్ చిన్న పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది.
Also Read : Pawan Kalyan Ranveer Singh : ఇది ఫస్ట్ టైం కాదు.. రణవీర్ వర్సెస్ పవన్.. గతంలో రెండు సినిమాలకు ఇలాగే ఫైట్..
సాంకేతిక అంశాలు..
ధురంధర్ పార్ట్ 1 సాంకేతికంగా చాలా బాగుందని పేరొచ్చింది. ఈ సినిమా కూడా అంతే. సాంకేతికంగా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త సినిమాటిక్ షాట్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు మాత్రం యావరేజ్. యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేసారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్.
సెట్స్ అయితే పాకిస్తాన్ అచ్చం ఇలాగే ఉంటుందేమో అనేంతగా పర్ఫెక్ట్ గా వేశారు. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక భారతదేశం, పాకిస్తాన్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాటిక్ గా రాసుకున్న కథ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైలాగ్స్ బాగా రాసారు. చాలా డైలాగ్స్ మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా చాలానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘దురంధర్ ది రివెంజ్’ సినిమా ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా. దేశభక్తి, యాక్షన్, ఎమోషన్స్ మేళవించి తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 3.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
