దిశ ఫ్యామిలీని బాధపెట్టను.. ఇది నా గ్యారెంటీ : దిశ తండ్రితో ఆర్జీవీ..

RGV- Disha Encounter Movie: మొన్న ప్రణయ్, అమృతల కథ ఆధారంగా ‘మర్డర్’ మూవీతో కాంట్రవర్శీ క్రియేట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు యావత్ భారతదేశంలో కలకలం రేపిన హత్యాచార ఘటన ఆధారంగా.. ‘దిశా ఎన్‌కౌంటర్’ అనే సినిమా తెరకెక్కించాలని రెడీ అయ్యాడు. దిశ పోస్టర్‌తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ మూవీని ఆపాలంటూ బాధితురాలి తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిశ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ చేస్తున్న సమయంలో ఇలా సినిమా చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారాయన. దిశ సంఘటనతో తమ కుటుంబమంతా దుఃఖంలో మునిగిపోయిందని.. ఇలాంటి సమయంలో వర్మ సినిమా తీయడం సరికాదన్నారు. దీంతో శ్రీధర్ రెడ్డి అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి, నిర్మాత నట్టికుమార్, దర్శకుడు వర్మ 10 TV తో మాట్లాడారు.
‘‘మా అమ్మాయి పేరుతో సినిమా చేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించాలి. ట్రైలర్ లో అమ్మాయిని కాల్చడం వంటివి చూపిస్తున్నారు. అది చూసి పైశాచికానందం పొందుతున్నారు. మా కుటుంబ పరువు బజారుకీడ్చారు. అవి చూసి మేం గుండెపగిలేలా రోదిస్తున్నాం. మా అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోకుండా రేప్ వంటి సంఘటనలు మాత్రమే చూపిస్తారా’’.. ట్రైలర్ చూసి మా భార్య చాలా ఏడ్చింది.. సమాజం కోసం సినిమా తీస్తే మా బాధను కూడా చూపించాలి కదా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి.
‘‘దిశ, నిర్భయ వంటి ఘటనలు పలు చోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత భయంకరమైన దారుణాలు జరగడానికి కారణమయ్యే నేరస్తుల మనస్తత్వాలు, వారి మానసిక పరిస్థితితో పాటు పోలీసు వ్యవస్థ యొక్క దర్యాప్తు వంటివన్నీ లోతుగా స్టడీ చేసి.. దిశతో పాటు పలు సంఘటనలను బేస్ చేసుకుని అల్లుకున్న కథ ఇది. అందుకే దిశ అనే పేరు పెట్టాం. సినిమాలో అమ్మాయి పేరు దిశ కాదు. నేను సమాజానికి సందేశాన్నివ్వాలనే బాధ్యతతో తీస్తున్న దిశ సినిమా వాళ్ల ఫ్యామిలీ ఇబ్బంది పడేలా ఉండదని నేను హామీ ఇస్తున్నాను..’’ అన్నారు ఆర్జీవీ.
‘‘సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు కొందరు పనిలేనివాళ్లు. వారిపై చర్యలు తీసుకోవాలి. దిశకు జరిగిన అన్యాయానికి సంబంధించే సినిమా ఉంటుంది.. ఇది దిశ బయోపిక్ కాదు. హత్యాచారాలను ఆపడానికి, ఇంకోసారి అటువంటి తప్పులు చేయాలంటే భయంకలిగేలా మేం చేస్తున్న ప్రయత్నమిది. ఎవర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు’’.. అన్నారు నిర్మాత నట్టికుమార్.