Champion Review : ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ.. రజాకార్లపై పోరాడిన భైరాన్ పల్లి కథ.. కొత్త నేపథ్యంలో..

శ్రీకాంత్ కొడుకు రోషన్ ఛాంపియన్ అంటూ ఏదో భారీగా తీసాడు అని, నిజాం, రజాకార్లు, భైరాన్ పల్లి కథ అని టీజర్, ట్రైలర్స్ లో చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Champion Review)

Champion  Review : ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ.. రజాకార్లపై పోరాడిన భైరాన్ పల్లి కథ.. కొత్త నేపథ్యంలో..

Champion Movie Review

Updated On : December 25, 2025 / 12:21 PM IST

Champion Review : రోషన్, అనస్వర రాజన్ జంటగా తెరకెక్కిన సినిమా ఛాంపియన్. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజాం కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా నేడు డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

ఈ కథ అంతా భారతదేశానికి స్వతంత్రం వచ్చాక హైదరాబాద్ భారత్ లో కలవకముందు నిజాం పాలనలో జరుగుతుంది. మైఖేల్ విలియం(రోషన్) సికింద్రాబాద్ తరపున ఆడే ఒక ఫుట్ బాల్ ప్లేయర్. ఎలాగైనా లండన్ వెళ్ళిపోయి అక్కడ ఫుట్ బాల్ ఆడుతూ సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ గెలవడంతో ఆ అవకాశం వచ్చినా విలియం తండ్రి బ్రిటిష్ వాడు అయినా భారత్ కి సపోర్ట్ చేసాడని దేశ ద్రోహం కింద ఇతనికి ఇంగ్లాండ్ లో ఎంట్రీ ఉండదు. కానీ ఇతని ఆట నచ్చి నువ్వు ఎలాగైనా ఇంగ్లాండ్ వస్తే నేను ఆడిస్తాను అని చెప్తారు.

ఇదే సమయంలో నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నిస్తుంటాడు. నిజంకి వ్యతిరేకంగా అనేక గ్రామాలు విప్లవం చేస్తుంటే నిజాం రజాకార్లతో ఆ గ్రామాలను నాశనం చేస్తుంటారు. అందులో భైరాన్ పల్లి ఒకటి. ఎలాగైనా లండన్ వెళ్లిపోవాలని అక్రమంగా గన్స్ డెలివరీ చేస్తే ఫ్లైట్ లో తీసుకెళ్తాను అని ఓ బ్రిటిష్ డీలర్ చెప్పడంతో మైఖేల్ అందుకు ఒప్పుకుంటాడు. కానీ గన్స్ తీసుకెళ్తుండగా పోలీసులు, నిజాం మనుషులు నుంచి తప్పించుకొని అనుకోకుండా భైరాన్ పల్లికి వెళ్తాడు.

అక్కడ మారు పేర్లతో మైఖేల్, అతని ఫ్రెండ్ ఆశ్రయం పొందుతూ ఆ ఊళ్ళో జనాలతో కలుస్తారు. అక్కడే మైఖేల్ కి చంద్రకళ(అనశ్వర రాజన్) పరిచయం అవుతుంది. మరి మైఖేల్ ఎవరు అని భైరాన్ పల్లి గ్రామస్థులకు తెలుస్తుందా? అతని దగ్గర గన్స్ బయటపడతాయా? నిజాం పోలీస్ ఆఫీసర్, మైఖేల్ పై పగతో ఉన్న బాబు దేశ్ ముఖ్(సంతోష్ ప్రతాప్) ఏం చేస్తాడు? భైరాన్ పల్లి ప్రజలు నిజాం ఆఫీసర్స్, రజాకార్లను ఎలా ఎదుర్కొన్నారు? మైఖేల్ గన్స్ డెలివరీ చేసి లండన్ వెళ్లాడా లేక ఇక్కడే ఉన్నాడా..? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Eesha Review : ‘ఈషా’ మూవీ రివ్యూ.. వామ్మో భయపడి చచ్చేలా ఉన్నారు..

సినిమా విశ్లేషణ..

శ్రీకాంత్ కొడుకు రోషన్ ఛాంపియన్ అంటూ ఏదో భారీగా తీసాడు అని, నిజాం, రజాకార్లు, భైరాన్ పల్లి కథ అని టీజర్, ట్రైలర్స్ లో చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ మైఖేల్ ఆట, సరదాగా గడపడంతో సాగుతూ గన్స్ డెలివరీ ఒప్పుకున్నాక ఆసక్తి నెలకొంటుంది. మైఖేల్ భైరాన్ పల్లికి వెళ్ళాక అక్కడ కాస్త కథని నడిపించడానికి సాగదీశారు. ఈ మధ్యలో జాతీయ భావం, అప్పట్లో రజాకార్లు చేసిన అరాచకాలు, జనాలు ఎలా పోరాడారు అనే సీన్స్ కూడా బాగానే చూపించారు.

ఇంటర్వెల్ కి భైరాన్ పల్లి పై రజాకార్లు చేసిన దాడి ఎదుర్కునే సీన్స్ తో సినిమా ఒక్కసారిగా హై లెవల్ కి వెళ్తుంది. దీంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఇండియానే వద్దు, ఈ యుద్దాలు వద్దు అనుకునే మైఖేల్ ఎలా మారాడు అని, నిజాం రజాకార్లు – భైరాన్ పల్లి మధ్య జరిగే పోరాటం, మధ్యలో మైఖేల్ ప్రేమకథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో బాబు దేశ్ ముఖ్ పాత్ర ఎంట్రీ ఇచ్చాక సినిమా మరింత ఉత్కంఠగా సాగుతుంది. అయితే జాతీయభావం అనే ఎమోషన్ కనెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు దర్శకుడు.

ఇటీవల రజాకార్ సినిమాలో ఇదే భైరాన్ పల్లి కథతో కన్నీళ్లు పెట్టించారు. కానీ ఇందులో ఆ ఎమోషన్ మిస్ అయింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తే ఎక్కడో క్లైమాక్స్ లో ఆ జాతీయభావం అనే ఎమోషన్ కొద్దిగా కనెక్ట్ అవుతుంది. ఏది ఏం జరిగినా మొదటి నుంచి ఒకే గోల్ తో ఉన్న హీరో సడెన్ గా మారిపోవడం అంత క్లారిటీగా చూపించలేదు. ఓ పక్క ఫుట్ బాల్, మరో పక్క లవ్ స్టోరీ, మరో పక్క తండ్రి ఎమోషన్, మరో పక్క నిజాం పై పోరాటం ఇలా నాలుగు ఎమోషన్స్ తీసి అన్ని మిక్స్ చేసి దీనిపై సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎక్కడో ఫుట్ బాల్ తో మొదలైన కథ నిజాంపై పోరాటంగా మారుతుంది. అయితే అప్పట్లో జరిగిన సంఘటనలు, జాతీయభావంతో సినిమా జనాలకు కనెక్ట్ అవ్వవచ్చు.

Roshan Anaswara Rajan Champion Movie Review and Rating

నటీనటుల పర్ఫామెన్స్..

శ్రీకాంత్ కొడుకు రోషన్ మొదటి సినిమా పెళ్లిసందDతో పర్వాలేదు అనిపించినా కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ తో వచ్చి అదరగొట్టాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా, పోరాట సన్నివేశాల్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసాడు అని అర్థమవుతుంది.

మలయాళీ భామ అనశ్వర రాజన్ క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. మలయాళీ భామ అయినా పట్టు పరికిణిలో అచ్చ తెలుగు అమ్మాయిలా అలరించింది. ఆల్మోస్ట్ 30 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి నటుడు కళ్యాణ్ చక్రవర్తి బైరాన్ పల్లి పెద్దగా బాగానే మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ లో సంగీత్ ప్రతాప్ చాలా బాగా నటించాడు. ప్రకాష్ రాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో ఆశ్చర్యపరిచారు. మురళీ శర్మ, అర్చన.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న అవంతిక వందనపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తో మెప్పించింది.

Also Read : Dhandoraa Review : ‘దండోరా’ మూవీ రివ్యూ.. శివాజీ మళ్లీ అదరగొట్టాడుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే బాగున్నాయి. 1948 కథ కావడంతో ఆ కాలానికి తగ్గట్టు వస్తువులు, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ లో మాత్రం చాలా సీన్స్, ఫస్ట్ సాంగ్ కట్ చేసుకోవచ్చు. దర్శకుడు భైరాన్ పల్లి కథని కొత్త నేపథ్యంతో చెప్పడానికి ప్రయత్నించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఛాంపియన్’ సినిమా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన భైరాన్ పల్లి కథకు ఫుట్ బాల్ ప్లేయర్ నేపథ్యంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రం.