భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘సాహో’. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా సత్తా చూపించే సినిమా ఇది అని అందరూ భావించారు. అయితే అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం లేదు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా సాహో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా నిరూపించుకుంటున్నాడు.
దేశవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఏడు రోజులకు అన్నీ భాషల్లో కలిపి రూ.370 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, 2.0 సినిమాల తర్వాత సౌత్ ఇండియాలో నాలుగో స్థానంలో సాహో నిలిచింది.
అయితే తొలి వారం రోజుల్లో 4 రోజులు హాలీడేస్ ఉండటంతో భారీ వసూళ్లు రాబట్టినా కూడా వీక్ డేస్ మొదయ్యాక కలెక్షన్లు వీక్ అయ్యాయి. దాంతో బయ్యర్లకు టెన్షన్ పట్టుకుంది. ఈ చిత్రం 290 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. బయ్యర్లు నష్టపోకుండా ఉండాలంటే ఇంకా రూ.85 కోట్లు వసూలు చేయాలి. ఇక తెలుగు విషయానికి వస్తే రూ.124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా.
కానీ ఇప్పటి వరకు సినిమాకు మొత్తం 82 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందట. అంటే సినిమా నష్టాల్లోకి వెళ్లకూడదంటే ఇంకా రూ.42 కోట్లు రాబట్టుకోవలసిన పరిస్థితి. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తుంటే మాత్రం అన్ని కోట్లు రావడం ఈజీ కాదు. అయితే ఈ వారం కూడా తెలుగులో పెద్ద సినిమాలు ఏమీ విడుదల కావట్లేదు కాబట్టి సాహో కలెక్షన్లు వస్తే మాత్రం బయ్యర్లు నష్టాల నుంచి బయటపడినట్లే.