Mercy Killing : ‘మెర్సీ కిల్లింగ్’ మూవీ రివ్యూ.. ఓ అనాధ బాలిక కథ..
'మెర్సీ కిల్లింగ్' భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కించారు. ఏప్రిల్ 12న మెర్సీ కిల్లింగ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

Sai Kumar Parvateesam Mercy Killing Movie Review
Mercy Killing : సాయి కుమార్(Sai Kumar), పార్వతీశం, ఐశ్వర్య, హారిక ముఖ్య పాత్రల్లో సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాణంలో సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మెర్సీ కిల్లింగ్’. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఏప్రిల్ 12న మెర్సీ కిల్లింగ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. అనాధగా బతుకుతున్న స్వేచ్ఛ(హారిక) తన పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. అలా తన పేరెంట్స్ ని వెతుకుతున్న క్రమంలో స్వేచ్ఛకు సముద్రంలో చేపలు పట్టుకునే మహేష్ (పార్వతీశం), అతని ప్రేమికురాలు భారతి (ఐశ్వర్య)లు కలుస్తారు. మహేష్ తో పాటు అక్కడ చేపలు పట్టేవాళ్లంతా అక్కడి రాజకీయ నాయకుడు కింద నలిగిపోతుంటారు. వాళ్ళ నుంచి మహేష్, ఐశ్వర్య ఎలా బయటపడ్డారు. స్వేచ్ఛ ఎందుకు మెర్సీ కిల్లింగ్ ద్వారా చనిపోవాలనుకుంటుంది? స్వేచ్ఛ పేరెంట్స్ దొరుకుతారా? రామకృష్ణమ్ రాజు (సాయి కుమార్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. మెర్సీ కిల్లింగ్ అంటే తమని ఎలాంటి బాధ లేకుండా చంపేయమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడం. అలాంటి కాన్సెప్ట్ తో ఓ అనాధ బాలిక ఎందుకు చనిపోవాలనుకుంటుంది అనే కథని తీసుకొని దాని చుట్టూ మరో కమర్షియల్ కథని రాసుకొని ఈ మెర్సీ కిల్లింగ్ సినిమాని తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. ఓ పక్క లవ్ స్టోరీ, మరో పక్క ఆనాధలు ఎదుర్కునే అవమానాలు, మరో పక్క పేదలపై అన్యాయం.. ఇలా అన్నిటిని కథలో చక్కగా ఇమడ్చారు.
నటీనటులు.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో అనాధ బాలిక స్వేచ్ఛ పాత్రలో మెప్పించింది. సినిమా చాలా వరకు ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. పార్వతీశం మొదటిసారి యాక్షన్ రోల్ చేశాడు. టీవీ నుంచి వెండితెరకి వచ్చిన ఐశ్వర్య తన పాత్రతో ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పిస్తుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా అలరిస్తుంది. రామరాజు, సాయి కుమార్, సూర్య.. తమ పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కాకుండా ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ బీచ్.. ఇలా రియల్ లొకేషన్స్ లో షూటింగ్ తీశారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. కొత్త కథని తీసుకొని దానికి కమర్షియల్ అంశాలను రాసుకొని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.