సానియా బయోపిక్ : అతిథి పాత్రలో నటించనున్న టెన్నిస్ స్టార్

సానియా బయోపిక్ : అతిథి పాత్రలో నటించనున్న టెన్నిస్ స్టార్

Updated On : February 9, 2019 / 11:23 AM IST

టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ బయోపిక్‌ల ట్రెండ్ జోరందుకుంది. రాజకీయ నాయకులు సినిమా హీరోయిన్ల జీవితాలే కాకుండా క్రీడాకారుల జీవితాలపైనా సినిమాలు తీసేస్తున్నారు. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా (బాగ్ మిల్కా బాగ్), మేరీ కోమ్ జీవితం ఆధారంగా మేరీ కోమ్, ధోనీ జీవితం ఆధారంగా ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ ఇలా తెరకెక్కినవే. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను అలరించేందుకు మరో టెన్నిస్ స్టార్ సినిమా సిద్ధం కాబోతుంది. 

సానియా మీర్జా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రొన్ని స్క్రూవాలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుంది. కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆదివారం సానియామీర్జా స్వయంగా నిర్దారించారు. చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలుపెట్టేశారు. అయితే సానియా పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు. 

అయితే కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం సానియానే కనిపించనున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా క్లైమాక్స్ సీన్‌లో రాజశేఖర్ రెడ్డి ఫుటేజిలనే చూపించడంతో ప్రజలకు బాగా దగ్గరైంది. ఇదే తరహాలో డబుల్స్ విభాగంలో ఏకైక గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించినప్పటి సన్నివేశంలో సానియానే బాగుంటుందని సినీ బృందం భావిస్తుందట. 

ఈ మేర ఆయా సన్నివేశాలలో సానియానే కనిపించొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2016లో ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరిట తన జీవిత కథను తానే పుస్తక రూపంలో అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.