Sayaji Shinde: పవన్ కల్యాణ్‌తో షాయాజీ షిండే సమావేశం.. ఎందుకంటే?

పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉందని షాయాజీ షిండే ఇటీవలే బిగ్ బాస్‌లో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందంటూ షాయాజీ షిండే ఇటీవల అన్నారు. దీనిపై పవన్ కల్యాణ్‌ను కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి షాయాజీ షిండే వచ్చారు.

కాగా, పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉందని షాయాజీ షిండే ఇటీవలే బిగ్ బాస్‌లో చెప్పారు. షాయాజీ షిండే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆయన హీరో సుధీర్ బాబుతో కలిసి ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్‌కి వచ్చారు.

ఆ సమయంలో మాట్లాడుతూ… తన తల్లి మరణించే ముందు తన దగ్గర ఇంత డబ్బు ఉండీ ఆమెను బతికించుకోలేకపోతున్నానని అనుకున్నానని తెలిపారు. తానేం చేయగలనని ఆలోచించానని, అప్పుడు తన అమ్మ బరువుకు సమానమైన విత్తనాలు తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటుతానని ఫిక్స్ అయ్యానని తెలిపారు.

గుళ్లలో ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుందని తెలిపారు. తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఇప్పుడు పవన్ అపాయింట్మెంట్ దొరికితే ఆయనను కలిసి ఈ వివరాలు చెబుతానని తెలిపారు. చెప్పినట్లే ఇవాళ పవన్‌ను కలిశారు.

సమంత హైదరాబాద్‌కు రావాలని ట్రోల్ చేయాలి: త్రివిక్రమ్ శ్రీనివాస్‌