జబర్దస్త్ షోతో లైమ్‌లైట్‌లోకి వచ్చి కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటూ హీరోగా ఎదిగన షకలక శంకర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా షకలక శంకర్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేమిటంటే షకలక శంకర్ చనిపోయాడంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో క్లారిటీ ఇస్తూ జబర్ధస్త్ యాక్టర్ గెటప్ శీను షకలక శంకర్‌తో వీడియోను విడుదల చేశారు.
తనకు ఎదో అయిపోయింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమంటూ ఆ రూమర్లను ప్రచారం చేసిన వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎవడు బే వాడు మీకు రావేంట్రా రోగాలు.. ఎక్కడి నుంచి వస్తార్రా మీరంతా.. మా పని మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోనివ్వండ్రా’ అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇదే సమయంలో ఇటువంటి వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ గెటప్ శ్రీను విజ్ఞప్తి చేశారు.
ఇదే విషయమై మరో ప్రముఖ నటుడు జెమినీ సురేష్ కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. మా శంకర్ చనిపోయాడు అంటూ యూట్యూబ్, సోషల్ మీడియాలో వార్త కధనాలు రావటం చాలా దురదృష్టకరం. రేటింగ్స్ కోసం ఇంత దారుణానికి దిగజారడం నాకు బాధ కలిగించింది. ఈ రోజు మొత్తం మేమంతా షూటింగ్‌లోనే ఉన్నాం. మా మధ్యే షూటింగ్లో ఉన్న శంకర్ మీద ఇలాంటి వార్తలు రావడం అన్యాయం కదండీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయ్యా… మీకు నిత్యం నవ్వులని పంచి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ సంతోషమే మా బలం అనుకుంటూ నటులుగా మీ ఇంటిలోకి, మీ మనసులోకి వచ్చి మీఇంటి బిడ్డల్లా పెరుగుతున్న మమ్మల్ని ఇలా ప్రతి క్షణం చంపేయకండి. ప్లీజ్ మేము చచ్చేంత వరుకు అయినా బ్రతనివ్వండి… మీ ప్రతి చిరునవ్వులో ఉండాలని ఆశపడే చిన్న జీవితాలండి..మావి…ప్రేక్షకులే మాకు ప్రత్యక్ష దేవుళ్ళు మనసుంటే ఆశీర్వదించండి..మీ గుండెల్లో చిన్న చోటు ఇవ్వండి చాలు.. అదే మాకు శ్రీ రామ రక్ష.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ ద్వారా వారి బాధను వ్యక్తం చేశారు. కాగా వారు చేస్తున్న అభ్యర్ధనకు నెటిజన్లు వారి మద్దతు తెలుపుతున్నారు.