Manamey Review : ‘మనమే’ మూవీ రివ్యూ.. అదిరిపోయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..

మనమే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు.

Sharwanand Krithi Shetty Manamey Movie Review and Rating

Manamey Movie Review : శర్వానంద్(Sharwanand) తన 35వ సినిమాగా ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మనమే సినిమా నేడు జూన్ 7న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో కృతిశెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటించింది.

కథ విషయానికొస్తే..
విక్రమ్(శర్వానంద్) లైఫ్ ని సరదాగా గడిపేయాలి అనే ఆలోచనలతో లండన్ లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. విక్రమ్, అనాధ అయిన అనురాగ్(త్రిగున్) క్లోజ్ ఫ్రెండ్స్. అనురాగ్, అతని భార్య శ్వేత(మౌనిక) ఇండియాకి వచ్చి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వాళ్ళ అబ్బాయి ఖుషి(విక్రమ్ ఆదిత్య) అనాథ అవుతాడు. శ్వేతా లవ్ మ్యారేజ్ చేసుకుందని కోపంగా ఉన్న తన పేరెంట్స్ ఖుషిని కూడా వద్దంటారు. దీంతో శ్వేత ఫ్రెండ్ సుభద్ర(కృతి శెట్టి) ఆ బాబుని పెంచుకోడానికి రెడీ అవుతుంది. కానీ ఆ అబ్బాయి ఇంగ్లాండ్ సిటిజన్ షిప్ అవడంతో రూల్స్ అడ్డువస్తాయి.

వాళ్ళ రూల్స్ ప్రకారం కనీసం నాలుగు నెలలు పేరెంట్స్ లాగా కేర్ టేకర్స్ చూసుకోవాలి లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాధగా తీసుకొని ఆర్ఫనేజ్ లో అప్పచెప్తారు. దీంతో తన ఫ్రెండ్ లాగే అతని కొడుకు కూడా అనాధ అవ్వకూడదు అని విక్రమ్, సుభద్రతో కలిసి లండన్ లో బాబుని చూసుకోడానికి ఫిక్స్ అవుతాడు. కానీ అప్పటికే సుభద్రకు కార్తీక్ తో(శివ కందుకూరి) నిశ్చితార్థం జరిగి ఉంటుంది. మరి విక్రమ్, సుభద్ర పిల్లాడ్ని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో లండన్ లో పిల్లాడితో ఈ ఇద్దరు పడ్డ కష్టాలు ఏంటి? విక్రమ్ కి లైఫ్ మీద సీరియస్ నెస్ వచ్చిందా? సుభద్ర విక్రమ్ తో ఉండటానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? అనురాగ్ రెస్టారెంట్ పార్ట్నర్ తో వచ్చిన కష్టాలు ఏంటి? విక్రమ్ – సుభద్ర మధ్య ప్రేమ ఎలా పుడుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Satyabhama : ‘సత్యభామ’ మూవీ రివ్యూ.. పెళ్లి తర్వాత యాక్షన్ అదరగొట్టిన కాజల్..

సినిమా విశ్లేషణ..
కథ పరంగా భార్యాభర్తలు చనిపోవడంతో వాళ్ళ బాబు అనాథ అయితే ఇంకో కపుల్ ఎలా చూసుకున్నారు అనే పాయింట్ తీసుకున్నా దాన్ని చాలా అందంగా అద్భుతంగా చూపించారు. ఒక పెళ్లి కానీ కపుల్ తమ ఫ్రెండ్ బాబు కోసం ఏం చేశారు అనే కథాంశంతో కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి చివరివరకు కూడా ఎక్కడా బోర్ కొట్టదు.

ఫస్ట్ హాఫ్ మొదట్లో ఫ్రెండ్షిప్ ఎమోషన్ చూపించినా ఆ తర్వాత ఫుల్‌గా నవ్విస్తారు. బాబుతో విక్రమ్ పడే కష్టాలు ఫుల్‌గా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ కూడా నవ్విస్తూనే చివర్లో ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టిస్తారు. కొన్ని సీన్స్ సినిమాటిక్ గా అనిపించినా సినిమా కాబట్టి తప్పులేదు అనిపిస్తుంది. ఈ సినిమాని లండన్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాసుకున్నారు. ఈ సినిమాలో 16 పాటలు ఉన్నా కథ పరంగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి తప్ప ఎక్కడా కూడా పాటలు ఎందుకు అనిపించకపోవడం చాలా ప్లస్ పాయింట్. అయితే సినిమాలో రాహుల్ రవీంద్రన్ పాత్ర, అతని సీన్స్ మాత్రం ఎందుకు అనిపిస్తాయి. అది లేకపోయినా కథ బాగానే వెళ్తుంది కదా అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
శర్వానంద్ అల్లరి చిల్లరిగా బాధ్యతలు లేని కుర్రాడిగా నవ్వించి చివర్లో ఎమోషన్‌తో మెప్పిస్తాడు. ఇక కృతిశెట్టి ఒక బాబుని చూసుకోవడం తన ఏజ్ కి మించిన పాత్ర అయినా కథ పరంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. బాబు పాత్రలో ఈ సినిమా దర్శకుడి తనయుడు విక్రమ్ ఆదిత్యనే నటించాడు. రెండేళ్ల బాబు చాలా క్యూట్ గా నటించాడు. త్రిగున్ శర్వా ఫ్రెండ్ క్యారెక్టర్ లో కాసేపు కనిపించినా మెప్పించాడు. శివ కందుకూరి తనకు కాబోయే భార్య వేరే వాళ్ళతో కలిసి పిల్లాడ్ని చూసుకుంటుంది అనే అసహనం ఉన్న పాత్రలో బాగా నటించాడు. అయేషా ఖాన్ ఇటీవల తెలుగు సినిమాల్లో బాగా కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా మంచి పాత్రే పడింది. సీరత్ కపూర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, సుదర్శన్, వెన్నెల కిషోర్.. మిగిలిన పాత్రలు కూడా మెప్పిస్తాయి.

Also Read: ‘లవ్ మౌళి’ రివ్యూ.. ప్రేమ గురించి నవదీప్ కొత్తగా ఏం చెప్పాడు?

సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించారు. లండన్ లొకేషన్ లో ప్రతి సీన్ అద్భుతంగా చిత్రీకరించారు విష్ణు శర్మ. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మాములు కథని చాలా అందంగా రాసుకున్నాడు, చూపించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇక మ్యూజిక్ అయితే అదిరిపోయింది. హేశం అబ్దుల్ వాహబ్ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు 16 పాటలకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని ఇచ్చి మెప్పించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ప్రస్తుతం మంచి మంచి సినిమాలతో దూసుకుపోతుంది. ఈ సినిమా కోసం కూడా లండన్ లో బాగానే ఖర్చుపెట్టి షూట్ చేసి మరో మంచి సినిమా ఇచ్చారు.

మొత్తంగా ‘మనమే’ సినిమా ఫ్రెండ్స్ బాబు కోసం ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ బాబుని ఎలా చూసుకున్నారు అనే కథాంశాన్ని చాలా ఆహ్లదకరంగా అందంగా చూపించారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు. మనమే సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు