‘టిల్లు స్క్వేర్’ మూవీ రివ్యూ.. ‘డీజే టిల్లు’ని మించి ఉందా?.. సిద్ధూ, అనుపమ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లుకి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా కొన్ని ట్విస్టులతో కలిపి ప్రేక్షకులని మెప్పించే సినిమా టిల్లు స్క్వేర్.

Tillu Square Review : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)ని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసిన సినిమా ‘డీజే టిల్లు'(DJ Tillu). ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అప్పుడే దానికి సీక్వెల్ ప్రకటించారు. డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా నేడు మార్చి 29న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

టిల్లు స్క్వేర్ కథ విషయానికొస్తే..
డీజే టిల్లు సినిమాలో రాధిక వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రేమ బాధలో ఉంటూనే ఈవెంట్స్, డీజేగా చేసుకుంటూ ఉండగా టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) వస్తుంది. అనుకోకుండా ఓ పబ్బులో ఇద్దరూ కలుస్తారు. అక్కడే బాగా కాజ్ అయి ముద్దులు పెట్టేసుకొని ఓ రూమ్ కి వెళ్తారు. తెల్లారేసరికి ఒక లెటర్ పెట్టి లిల్లీ మాయమవుతుంది. దీంతో టిల్లు.. లిల్లీ కోసం వెతుకులాట మొదలుపెడతాడు. ఓ నెల రోజుల తర్వాత హాస్పిటల్ లో లిల్లీ కనిపించి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో పెళ్లి చేసుకుంటాను అంటాడు. డీజే టిల్లులో టిల్లు బర్త్ డే రోజు రాధిక తన ఫ్లాట్ కి ఎలా పిలుస్తుందో ఈ సినిమాలో కూడా లిల్లీ అదే ఫ్లాట్ కి టిల్లు బర్త్ డే రోజే పిలుస్తుంది. దీంతో ఆ ఫ్లాట్ చూసి షాక్ అవుతాడు టిల్లు.

అలాగే తన అన్నయ్య సంవత్సరం నుండి కనపడకుండా పోయాడని, వెతకడానికి హెల్ప్ చేయమని టిల్లుని అడుగుతుంది లిల్లీ. అసలు లిల్లీ అన్నయ్య ఎవరు? మళ్ళీ అదే ఫ్లాట్ లో లిల్లీ ఏం చేస్తుంది? అసలు లిల్లీ ఎవరు? మధ్యలో ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్(మురళీశర్మ) టిల్లు లైఫ్ లోకి ఎందుకొచ్చాడు? ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకొచ్చింది? డీజే టిల్లులో ఉన్న ప్రిన్స్ పాత్ర మళ్ళీ ఎందుకొచ్చాడు? రాధిక ఏమైపోయింది? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
డీజే టిల్లు సినిమా హిట్ అవ్వడానికి కథ, కథనం కంటే కూడా టిల్లు క్యారెక్టర్, అతని క్యారెక్టరైజేషన్, సినిమా మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. ఆ పాయింట్ ని అర్ధం చేసుకొని ఈ సీక్వెల్ లో కూడా అదే ఫాలో అయ్యారు. టిల్లు క్యారెక్టర్ చుట్టే సినిమా నడుస్తుంది. కథ, అక్కడక్కడా ట్విస్టులిచ్చే కథనం ఉన్నప్పటికీ, డీజే టిల్లు క్యారెక్టర్ తో పాటు కామెడీ ప్రధానంగా సీన్స్ రాసుకొని వాటిని అల్లుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకు చూసి ఎంజాయ్ చేయాలి కానీ లాజిక్స్ వెతక్కూడదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్విస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్, స్లోగా సాగినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం మళ్ళీ అదిరిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో రాధికా ఎంట్రీతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. డీజే టిల్లుకి, టిల్లు స్క్వేర్ కి మాత్రం మంచి కనెక్టివిటీ ఇచ్చి మరో కొత్త సినిమాటిక్ యూనివర్సిటీని సృష్టించినట్టు అనిపిస్తుంది.

Also read : Legend Movie 10 Years Celebrations : బాలకృష్ణ ‘లెజెండ్’ పదేళ్ల వేడుక ఫొటోలు.. మెరిసిన సోనాల్..

నటీనటుల విషయానికొస్తే..
సినిమా అంతా సిద్ధూ జొన్నలగడ్డ మీదనే నడుస్తుంది. డీజే టిల్లులో ఓ లోకల్ హైదరాబాద్ కుర్రాడిగా ఫుల్ ఎనర్జీతో సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే మెయింటైన్ చేస్తూ సిద్ధూ తన ఎనర్జీ, కామెడీ, బాడీ లాంగ్వేజ్ తో మరోసారి సినిమా అంతా తన భుజాలపై వేసుకొని మెప్పించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో తన అందంతో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టేసింది. అయితే గ్లామర్ తోనే కాక నటనతో కూడా మెప్పించింది అనుపమ. రాధికగా నేహశెట్టి ఒక్క సీన్ లో కనిపించి థియేటర్స్ ని షేక్ చేసేసింది. టిల్లు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ తన నటనతో ఫుల్ గా నవ్వించాడు. మురళీశర్మ, ప్రిన్స్, మార్కస్ పాత్రలో నటించిన వ్యక్తి.. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపించారు.

Also Read: ‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’ మూవీ రివ్యూ.. ఉపాధి కోసం వెళ్లి ఎడారిలో బానిసగా మారితే..?

సాంకేతిక విషయాలు..
ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. భీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ థియేటర్లలో అదరగొట్టేసింది. సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమా అంతా క్యారెక్టరైజేషన్ మీద నడవడంతో స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడిగా మల్లిక్ రామ్ కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాలు నిర్మాణ విలువల పరంగా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ సినిమా కూడా అంతే.

మొత్తంగా టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లుకి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా కొన్ని ట్విస్టులతో కలిపి ప్రేక్షకులని మెప్పించే సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రేటింగ్ & రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు