Siddhu Jonnalagadda : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్‌బోయ్ సిద్ధు జొన్నలగడ్డ.. రూ.15 ల‌క్షల చెక్కు అందజేత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ క‌లిశారు. వరద బాధితులకు ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15 లక్షల చెక్కును అందజేశారు.

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda : టాలీవుడ్ యంగ్ యాక్టర్, స్టార్ బోయ్‌ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుగా తెలుగు ఆడియ‌న్స్‌కి అత్యంత సుప‌రిచితుడు. ఆదివారం నాడు (డిసెంబర్ 8న) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సిద్ధు క‌లిశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15 లక్షల చెక్కును అందజేశారు. వ‌ర‌ద‌లు ముంచెత్తిన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న‌వంతు సాయం అందిస్తాన‌ని సిద్ధు జొన్నలగడ్డ మాటిచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన సిద్ధు స్వయంగా రూ.15 లక్షలను అందించారు. తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ ఎమోష‌న‌ల్ నోట్ పోస్ట్ చేశారు.

అందులో “ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింది. ఇదేం భావ్యం కాదు. ఈ తరహా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు మరొకరికి రాకూడ‌దు. వ‌ర‌ద‌ల వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌న‌మంద‌రం ఏక‌మై చేయూత‌నివ్వాలి. నా వంతుగా రూ.30లక్షలను (ఏపీ, తెలంగాణ‌కు చెరో రూ.15లక్షలు)ను వ‌ర‌ద నివార‌ణ నిధికి అంద‌జేస్తాను.

వరదల కారణంగా జ‌రిగిన న‌ష్టాన్ని డ‌బ్బుతో భ‌ర్తీ చేయ‌లేమ‌ని తెలుసని, ఏదో ఒక ర‌కంగా కొంద‌రి జీవితాల‌ను పున‌రుద్ధరించడానికి వారిలో నమ్మకాన్ని క‌లిగించ‌డానికి ఈ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుందని ఆశిస్తున్నాను“ అని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదల సమయంలో తానిచ్చిన మాట‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సిద్ధు నేరుగా వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి తన చెక్కును అందించారు. సిద్ధు జొన్నలగడ్డతో పాటు ఆయ‌న తండ్రి సాయికుమార్ ఉన్నారు. కాంగ్రెస్ నేత డాక్టర్ సి రోహిన్ రెడ్డి, నిర్మాత కాశీ కొండ, మ‌హేంద్ర కూడా పాల్గొన్నారు.

‘టిల్లు’ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత తాజాగా సిద్ధూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకవైపు ‘జాక్… కొంచెం క్రాక్’ షూటింగ్ చేస్తూనే, కోన నీరజ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తెలుసు కదా’లో కూడా నటిస్తున్నాడు. సిద్ధూ ఇటీవలే ‘కోహినూర్’ అనే మరో మూవీని చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే ఇద్దరు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలిసింది.

ఇంతకుముందు మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలను రూపొందించిన పరశురామ్‌తో సిద్ధు జొన్నలగడ్డ త్వరలో కలిసి మూవీ చేయనున్నట్టు సినీవర్గాలు పేర్కొన్నాయి.

Read Also : Jani Master : జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..