Singer Kalpana: నా భర్త గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు.. వీడియో విడుదల చేసిన సింగర్ కల్పన

టాలీవుడ్ సింగర్ కల్పన రాఘవేందర్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

Singer Kalpana: నా భర్త గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు.. వీడియో విడుదల చేసిన సింగర్ కల్పన

singer kalpana

Updated On : March 7, 2025 / 12:37 PM IST

Singer Kalpana: టాలీవుడ్ సింగర్ కల్పన రాఘవేందర్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల మోతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు వార్తలు రావడంతో ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఖండించారు. అయితే, తాజాగా విడుదల చేసిన వీడియోలో కల్పన మాట్లాడుతూ.. తన భర్త గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యూలేట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.

 

కల్పన వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం.. మీడియాలో నా గురించి, నా భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానిపై క్లారిటీ ఇవ్వటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్డీ, ఎల్ఎల్ బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాను. నా భర్తతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు అని కల్పన పేర్కొన్నారు.

 

ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు.. దానికోసం కొద్దిరోజుల క్రితం చికిత్స తీసుకున్నాను. వైద్యులు సూచించిన మందులు ఓవర్ డోస్ లో తీసుకున్నాను. అందువల్లే స్పృహతప్పి పడిపోయాను. కానీ, నేను జీవించి మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం నా భర్త. ఆయన సరైన సమయంలో స్పందించి పోలీసుల సహకారం వల్ల నేను మీ ముందు ఉన్నాను. నా భర్త సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త అంటూ కల్పన తెలిపారు.

మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. త్వరలో మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తా. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వీడియోలో కల్పన పేర్కొన్నారు.