Singer Sunitha Son Akash First Movie Sarkaaru Noukari Review and Rating
Sarkaaru Noukari Movie : సునీత(Sunitha) తనయుడు ఆకాష్(Akash) హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్కారు నౌకరి’. మధులత, మహాదేవ్, తనికెళ్ళ భరణి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. 1990ల్లో ఎయిడ్స్ వచ్చిన కొత్తల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయకపోయినా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొల్పారు. సర్కారు నౌకరి సినిమా కొత్త సంవత్సరం కానుకగా నేడు జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చింది.
కథ విషయానికొస్తే.. కథ మహబూబ్ నగర్ కొల్లాపూర్ దగ్గర గ్రామాల్లో జరుగుతుంది. గోపాల్(ఆకాష్)ఓ అనాధ, గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ సంపాదిస్తాడు. సత్య(భావన)తో వివాహం అవుతుంది. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళని సర్కారు నౌకరి అంటూ పిలుస్తూ గొప్పగా చూసేవాళ్ళు. అదే సమయంలో ఇండియాలో కూడా ఎయిడ్స్ కేసులు పెరగడం, ఎవరికీ దాని గురించి అవగాహన లేకపోవడం, జనాభా నియంత్రణ గురించి అవగాహన కల్పించడం, నిరోధ్ ల గురించి ప్రజలకు చెప్పి వాటిని ఉపయోగించేలా చేయమని.. గోపాల్ లాంటి కొంతమందిని నియమిస్తారు. అప్పట్లో ప్రజలు నిరోధ్ ల గురించి తప్పుగా భావించడం, ఎయిడ్స్ అంటే అంటరాని వాళ్ళలా చూడటంతో గోపాల్, అతని భార్య సత్యని కూడా అంటరాని వాళ్ళలా చూసేవారు. దీంతో సత్యకుకోపం వచ్చి జాబ్ మానేయమన్నా గోపాల్ జాబ్ వదిలేయకపోవడంతో కడుపుతో ఉన్న సత్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఊళ్ళో ఎయిడ్స్ కేసులు రావడం, తన ఫ్రెండ్ కూడా చనిపోవడంతో గోపాల్ ఏం చేశాడు? ఊరి వాళ్ళని ఎలా మార్చాడు? వాళ్లకి ఎయిడ్స్, నిరోధ్ ల పై ఎలా అవగాహన కల్పించాడు? ఈ ప్రయాణంలో అతనికి వచ్చిన అడ్డంకులేంటి? కడుపుతో ఉన్న భార్య వదిలేసి వెళ్తా అన్న గోపాల్ జాబ్ ఎందుకు మానేయలేదు అనేవి తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. 1990ల్లో జరిగిన కథ కావడంతో ఆ కాలానికి తగ్గట్టు లొకేషన్స్, మాటలు, వస్తువులు, మనుషుల తీరు.. ఇలా అన్ని చక్కగా కుదుర్చుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొదట గోపాల్ – సత్య మధ్య పెళ్లి, కాపురం, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ఆ తర్వాత కొంచెం కామెడీతో సాగుతుంది. గోపాల్ నిరోధ్ లు పంచిపెట్టే పని చేస్తాడని తెలిసిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అంతా ఎమోషనల్ గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ డ్రామా వర్కౌట్ చేశారు. ఇక చివర్లో వచ్చే ఓ ట్విస్ట్ తో సినిమాకు మరింత హైప్ వస్తుంది. అయితే అది కూడా ఎమోషనల్ ట్విస్ట్ అవ్వడం గమనార్హం. సినిమా అంతా నిరోధ్, ఎయిడ్స్ వచ్చిన కొత్తలో గ్రామాల్లో ఉన్న పరిస్థితులు చుట్టే తిరుగుతుంది.
Also Read : Bubble Gum Review : బబుల్‌గమ్ మూవీ రివ్యూ.. సుమ తనయుడు రోషన్ కనకాల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
నటీనటుల విషయానికొస్తే.. సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా అయినా బాగానే నటించాడు అని చెప్పొచ్చు. హీరోయిన్ భావన, సెకండ్ లీడ్స్ గా చేసిన మహాదేవ్, మధులత జంట కూడా ప్రేమ సన్నివేశాలతో, అనంతరం ఎమోషనల్ గా మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు తనికెళ్ళ భరణి, రమ్య పొందూరి, మణి చందన, సమ్మెట గాంధీ, సత్య సాయిశ్రీనివాస్.. పలువురు వారి పాత్రల్లో మెప్పించారు. అయితే ఎక్కువ ఎమోషనల్ సీన్స్ ఉండటంతో కొత్తగా చేసిన మెయిన్ లీడ్స్ అందరికి కేవలం అందులో తప్ప మిగిలిన హావభావాలు పలికించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.
సాంకేతిక అంశాలు.. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ప్రతి ఎమోషనల్ సీన్ ని తన మ్యూజిక్ తో ఇంకో రేంజ్ కి తీసుకెళ్లి ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించాడు శాండిల్య పీసపాటి. కెమెరా విజువల్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టు బాగా చూపించారు. ఇక దర్శకుడు శేఖర్ గంగనమోని గతంలో పంచతంత్ర కథలు సినిమా తీసి మెప్పించాడు. ఇప్పుడు సర్కారు నౌకరి సినిమాతో మరోసారి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కథ, కథనంలో ఒక క్లారిటీతో సినిమాని నడిపించారు.
మొత్తంగా ‘సర్కారు నౌకరి’ సినిమా.. ఎయిడ్స్ వచ్చిన కొత్తల్లో పరిస్థితులు ఎంత కఠినంగా ఉండేవి అనే కథాంశంతో ఎమోషనల్ గా సాగిన డ్రామా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ పూర్తిగా విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..