Bubble Gum Review : బబుల్‌గమ్ మూవీ రివ్యూ.. సుమ తనయుడు రోషన్ కనకాల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన 'బబుల్‌గమ్' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దాని రివ్యూ ఏంటి..?

Bubble Gum Review : బబుల్‌గమ్ మూవీ రివ్యూ.. సుమ తనయుడు రోషన్ కనకాల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

Anchor Suma Kanakala son Roshan first movie Bubble Gum review

Bubble Gum Review : యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో నేడు డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటించగా అను హాసన్, హర్ష వర్ధన్, కిరణ్ మచ్చ, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. సుమ కొడుకు కావడం, యూత్ ఫుల్ బోల్డ్ సబ్జెక్టు అని ట్రైలర్స్ లో చూపించడం, సినిమా ప్రమోషన్స్ కి సుమ కోసం టాలీవుడ్ స్టార్స్ అంతా రావడంతో బబుల్‌గమ్ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే..
ఆది(రోషన్ కనకాల)పక్కా హైదరాబాద్ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇద్దరు ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూనే లైఫ్ లో పెద్ద DJ అవ్వాలని ట్రై చేస్తూ ఓ DJ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఉంటాడు. జాన్వీ(మానస) బాగా డబ్బున్న అమ్మాయి. కొన్ని నెలల్లో విదేశాలకు వెళ్లి చదువుకోబోతుండగా ఈ లోపు ఎవరైనా అబ్బాయితో ఆడుకొని, వాడి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలా ఓ పార్టీలో ఆది DJ బాగా చేస్తున్నావని చెప్పి అతనికి దగ్గరవుతుంది. ఆది సిన్సియర్ గా ప్రేమిస్తాడు. జాన్వీ కూడా తెలియకుండానే ఆదిని సిన్సియర్ గా ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఓ రోజు జాన్వీ బర్త్ డే పార్టీలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వితో క్లోజ్ గా మూవ్ అవ్వడం చూసి ఆది తట్టుకోలేకపోతాడు. దీంతో జాన్వీ బెస్ట్ ఫ్రెండ్ ధరణి.. ఆదిని ఓదారుస్తూ ఏం చేయాలో తెలియక ముద్దు పెడుతుంది. అదే సమయంలో జాన్వీ రావడంతో తప్పుగా అర్ధం చేసుకొని ఆదిని అందరిముందు అవమానించి ఒంటిమీద బట్టలు కూడా నేను కొనిచ్చినవే అని చెప్పి బట్టలు విప్పి పంపిస్తుంది. ఆ అవమానంతో ఆది ఏం చేశాడు? ఆది రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు? జాన్వీకి నిజం తెలుస్తుందా? ధరణి ఏం చేసింది?మళ్ళీ వీళ్లిద్దరు కలిశారా లేదా విడిపోయారా? ఆది గోల్ ఏమైంది అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
ఒక మాములు ప్రేమకథనే డైరెక్టర్ లోకల్ హైదరాబాద్ అబ్బాయికి ఇజ్జత్ ఉండాలి , లైఫ్ లో ఎదగాలి అనే కథాంశంతో ఈ బబుల్‌గమ్ ని తెరకెక్కించారు. మొదటి హాఫ్ అంతా హీరో క్యారెక్టర్, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు, మధ్యలో స్నేహితులతో, హీరో ఇంట్లో తండ్రితో కొన్ని కామెడీ సీన్లతో తాపీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఆదికి జరిగిన అవమానంతో సెకండ్ హాఫ్ లో హీరో ఏం చేస్తాడు అనే ఆసక్తి కలిగించేలా చేశారు. ఇక సెకండ్ హాఫ్ ఒక అరగంట బాగానే నడిపించినా ఆ తర్వాత అంతా కన్ఫ్యూజన్ తో, సాగదీస్తూ సాగుతుంది. చివరకు క్లైమాక్స్ కి ఒక కంక్లూజన్ లేకుండా కన్ఫ్యూజన్ లో ముగింపు ఇచ్చారు. హీరో – తండ్రి, హీరో – ఫ్రెండ్స్, వైవా హర్ష పాత్రలతో అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ చేశారు. ప్రేమ కథలో రొమాన్స్ సన్నివేశాలు కూడా బాగానే చేర్చి మరోవైపు లవ్ అనే ఎమోషన్ ని నడిపించారు.

Also read : Vyooham : వివాదాల వ్యూహం.. ఆ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

నటీనటుల విషయానికొస్తే..
రోషన్ కనకాల హీరోగా మొదటి సినిమా అయినా చాలా బాగా చేశాడు. సినిమా కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పొచ్చు. పక్కా లోకల్ హైదరాబాదీ అబ్బాయిగా రోషన్ మెప్పించాడు. హీరోయిన్ మానసా చౌదరి కూడా నటనతో పాటు మరో పక్క తన అందాలతో కూడా మెప్పించింది. ఇటు రొమాన్స్, అటు ఎమోషన్స్ సీన్స్ లో అలరించింది. ముఖ్యంగా రోషన్ తండ్రి పాత్ర చేసిన చైతు జొన్నలగడ్డ హైదరాబాద్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఇలాగే ఉంటాడు అనేలాగే అలరించి మెప్పించాడు. ఓ పక్క కొడుకుని తిడుతూ కామెడీ చేస్తూనే మరో పక్క ఎమోషనల్ గా నాన్న పాత్రలో ఒదిగిపోయారు. ఇక వైవా హర్ష మధ్యమధ్యలో ఓ పిచ్చోడి పాత్రలో కనిపించి కాసేపు నవ్విస్తాడు. హీరో ఫ్రెండ్స్ గా కిరణ్ మచ్చ, అనన్య సాయి అక్కడక్కడా కామెడీతో నవ్విస్తారు.

సాంకేతిక అంశాలు..
బబుల్‌గమ్ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ప్లస్ అయిందనే చెప్పొచ్చు. అయితే పాటల విషయంలో మాత్రం ఒక్కసారి వినడానికి పర్వాలేదనిపిస్తాయి. కెమెరా విజువల్స్ కూడా సీన్స్ కి తగ్గట్టు అందంగా చూపించారు. డైరెక్టర్ రవికాంత్ పేరెపు గతంలోనే తన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి కూడా దర్శకుడిగా సక్సెస్ అయినా కథ, కథనం విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ అయ్యాడు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రోషన్ ఏజ్ కి, కొత్త హీరోకి తగ్గట్టు ఫైట్స్ సింపుల్ గా కంపోజ్ చేశారు.

బబుల్‌గమ్ మొదట తియ్యగా ఉన్నా నమిలే కొద్దీ చప్పగా అయినట్టు ఈ సినిమా కూడా మొదట బాగున్నా చివర్లో సోసోగా అనిపిస్తుంది. మొత్తంగా రోషన్ ఒక ప్రేమకథని కొత్తగా అందివ్వడానికి బాగా కష్టపడ్డాడు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు బబుల్‌గమ్ అని టైటిల్ కాకుండా కాకుండా ఇజ్జత్ అని పెడితే ఇంకొంచెం కథ పరంగా సెట్ అయ్యేదేమో. బబుల్‌గమ్ సినిమాకు 2.75 వరకు రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు అభిప్రాయం మాత్రమే.