Vyooham : వివాదాల వ్యూహం.. ఆ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు.

Vyooham : వివాదాల వ్యూహం.. ఆ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

Petition On Vyooham Movie In AP High Court

వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.

వ్యూహం సినిమాలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోనియా గాంధీ, చంద్రబాబు కుమ్మక్కై జగన్ పై ఈడీ కేసులు పెట్టారని, జగన్ ను జైల్లో అక్రమంగా పెట్టారని వ్యూహం సినిమాలో సన్నివేశాలు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు. 139 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యూహం సన్నివేశాలు ఉన్నాయని అన్నారు.

వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని రిట్ పిటీషన్ లో కోరారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను పునః సమీక్ష చేయాలని కోరుతూ రాజేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

Also Read : హైకోర్టులో ఆర్జీవీ ‘వ్యూహం’పై వాదనలు.. సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేసుకోండి..

సీఎం జగన్ ని హీరోగా చూపిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను విలన్లుగా చిత్రీకరించిన సినిమా వ్యూహం అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వ్యూహం’ టీజర్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. కావాలనే చంద్రబాబు, పవన్ ను తప్పుగా చూపించారని, వారిని అమర్యాదపరిచారని వర్మపై ధ్వజమెత్తారు. ఈ సినిమాతో ఏపీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుందని వాదనలు వినిపించారు.

ఇప్పటికే ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది. ‘వ్యూహం’ సినిమా‌కు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది తెలుగుదేశం పార్టీ. ఈ పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉంది. దీనిపై హైకోర్టులో ఇరువర్గాలు వాదనలు వినిపించాయి.

ఈ చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులపై అవాస్తవ సంఘటనలు చిత్రీకరించి సినిమాలు ఎలా చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఇదంతా తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నమేనని టీడీపీ, జనసేన కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు.